
బతుకమ్మ వేడుకల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ కల్చరల్: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ ప్రారంభోత్సవం నిర్వహిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శనివారం హనుమకొండ వేయిస్తంభాల గుడి ప్రాంగణంలో జరుగుతున్న బతుకమ్మ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారుల మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌్, డీసీపీ షేక్ సలీమా, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్, ఏసీపీ నరసింహారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వేడుకలకు డిప్యూటీ సీఎం, మంత్రుల రాక
వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం నిర్వహించనున్న బతుకమ్మ ప్రారంభ వేడుకల్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి: ఈఓ రామల సునీత
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో ఈనెల 22 (సోమవారం) నుంచి అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం వరకు భద్రకాళి దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు వరంగల్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దాతల సహకారంతో మినరల్ మంచినీటి సౌకర్యం, ఉచిత అన్నప్రసాదాల వితరణ, ప్రతీరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. అమ్మవారి విశేషపూజ యాజమాన్యాన్ని పొందేందుకు భక్తులు రూ1,500 చెల్లించి రసీదును పొందాలని కోరారు. మాడవీధుల నిర్మాణంలో భాగంగా భద్రకాళి చెరువులో నీళ్లు లేనందున ఈ ఏడాది అమ్మవారికి తెప్పోత్సవ వేడుక నిర్వహించట్లేదని తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. ఉత్సవాల సందర్భంగా ప్రతీరోజు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, పూర్ణచందర్, సతీశ్, మయూరి, సుగుణ, పార్నంది నరసింహమూర్తి, వెంకటేశ్వర్లు, సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం