
తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడాలి
కాజీపేట రూరల్: తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీలు 42 శాతం రిజర్వేషన్ కోసం సంఘటితమై పోరాడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ అధ్యక్షతన కాజీపేటలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలపై అగ్రవర్ణ రాజకీయ పార్టీల వైఖరి మారకుంటే పార్టీలు, జెండాలకతీతంగా బీసీ కుల సంఘాలన్నింటిని ఏకతాటిపైకి తీసుకొచ్చి అగ్రవర్ణ పార్టీల భరతం పడతామని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఆమోదించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. బీసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు నవంబర్ 9న భువనగిరిలో లక్షమందితో బీసీల రాజకీయ యుద్ధభేరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్‌ముదిరాజ్, బీసీ కులాల జేఏసీ అధ్యక్షుడు ముకురాల చంద్రశేఖర్, బీసీ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వరంగల్ శ్రీనివాస్‌యాదవ్, బీసీ విద్యార్థి సంఘం కేంద్రకమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనుకాల శ్యామ్ కురుమ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మనిమంజరి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోడుగు మహేష్‌యాదవ్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్, నాయకులు మల్లయ్యయాదవ్, యాదగిరిగౌడ్, సమ్మయ్య, రాజుగౌడ్, సంగాని మల్లేశ్వర్, మహేందర్‌గౌడ్, నాగరాజ్, సురేష్, అశోక్‌గౌడ్, శోభారాణి, పద్మజాదేవి, అరుణ, సుగుణ, కిషోర్ పాల్గొన్నారు.
బీసీలపై అగ్రవర్ణ రాజకీయ పార్టీల
వైఖరి మారాలి
నవంబర్ 9న లక్షమందితో యుద్ధభేరి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ
అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్