
21 నెలల్లో రూ.1,025.45 కోట్ల పనులు
హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వంతో పని చేస్తున్న 21 నెలల కాలంలో రూ.1,025.65 కోట్లతో 27 ముఖ్యమైన పనులు మంజూరు చేయించానని, ఇంత పెద్ద మొత్తంలో ఏ నియోజకవర్గానకి కూడా నిధులు మంజూరు కాలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పనులపై కూడా చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రూ.800 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తే 8 పైసలు రాలేదనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ అభివృద్ధి పనులన్ని 2024 జనవరి తర్వాతనే మంజూరయ్యాయని స్పష్టం చేశారు. తేదీ వారీగా వివరాలు వెల్లడించారు. సాగునీటి రంగం, విద్య, వైద్యానికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. గోదావరి నీళ్లు ప్రతి గ్రామానికి చేరేలా కాల్వలు అభివృద్ధి చేశానని చెప్పారు. 80 శాతం గ్రామాలకు గోదావరి నీరు అందుతుందన్నారు. రూ.1,015 కోట్లతో దేవాదుల ప్రాజెక్టులోని కాల్వలన్నీ బాగుచేశామని వివరించారు. జఫర్‌గఢ్ మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్టేషన్ ఘనపూర్‌లో డిగ్రీ కళాశాల, చిల్పూరుకు ఐటీఐ మంజూరు, వేలేరు మండలం పీచరలో 132/33 కేవీ సబ్ స్టేషన్ మంజూరు చేయించానని వివరించారు. ఈ సబ్ స్టేషన్‌ను ఈ నెలాఖరులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభిస్తారని, అదే విధంగా 220/33 కేవీ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లింగాల జగదీష్‌రెడ్డి, కరుణాకర్ పాల్గొన్నారు.
విద్య, వైద్య, సాగు నీటికి ప్రాధాన్యం
రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు స్టేషన్ ఘనపూర్ ప్రజలకు అండగా ఉంటా
ఎమ్మెల్యే కడియం శ్రీహరి