
రెండో రాజధానిగా వరంగల్
హన్మకొండ: వరంగల్‌ను రెండో రాజధానిగా ఏర్పాటు చేయడం తమ పార్టీ విధానమని తెలంగా ణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారు. హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో తెలంగాణ రాజ్యాధికా ర పార్టీ రాష్ట్రకార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేకరుల సమావేశంలో తీన్మార్ మల్లన్న వెల్లడించారు. తెలంగాణ అనే పదాన్ని ఇష్టపడని బీఆర్‌ఎస్ ఆ పదాన్ని వదిలేసి తెలంగాణ ఆస్థిత్వానికి దూరమైన క్రమంలో ఆ అస్థిత్వాన్ని తమ భుజాల మీద ఎత్తుకున్నట్లు తెలిపారు. భూమిలేని బీసీ కుటుంబాలకు 2 ఎకరాల చొప్పున ఇస్తామన్నారు. అగ్రవర్ణాల పేదలకు సముచిత స్థానం కల్పించాలన్నారు. సచార్ కమిటీ నివేదికను అమలు చేసి మైనార్టీల అభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. జనాభా దామాషా ప్రకారం ఫలాలు అందాలన్నదే తమ విధానమ ని, ఈ మేరకు రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేస్తామని స్థానికతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఒక్కరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అమలు ప్రాధాన్యత అంశం కాదని, ముందుగా విద్య, ఉద్యోగాల్లో 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సూదగాని హరిశంకర్ గౌడ్, రజనీకుమార్, ప్రధాన కార్యదర్శులు వట్టె జానయ్య, సూర్యారావు, నాయకులు పల్లెబోయిన అశోక్, మదన్ మోహనచారి, ప్రసన్న, భావన, జ్యోతి పాండల్, మధు, పాషా మనోజ్, ప్రవీణ్, రమేష్ పాల్గొన్నారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ
అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న