
బాబు దొరను మట్టుబెట్టిన రైల్వేస్టేషన్ వ్యాగన్ పాయింట్
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరుబాట పట్టిన వరంగల్
సాయుధ పోరాటంలో ఉమ్మడి జిల్లా పాత్ర కీలకం
అసువులుబాసిన అమరులెందరో..
నేడు (సెప్టెంబర్ 17 సందర్భంగా) ఉద్యమ జ్ఞాపకం
భూస్వామ్య వ్యవస్థ రద్దు కోసం ఆనాడు ప్రజలు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. దొరలు, దేశ్‌ముఖ్‌లను గడగడలాడించి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో నిజాం పాపపు పాలనకు చరమగీతం పాడారు. రాక్షస రజాకార్ల అరాచకాలను ఎండగట్టారు. పంటను పాలకులు లాక్కుంటే మహిళలు వేటకొడవళ్లతో తరిమికొట్టారు. ఈ నేల నుంచి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యతోపాటు అనేక మంది అమరులయ్యారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన ఉద్యమాలు, వీరోచిత పోరాటంపై (సెప్టెంబర్ 17 సందర్భంగా) ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.
పరకాల: పరకాల పోరాట పటిమ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సాయుధ పోరాటంలో భాగంగా అజ్ఞాతంలోకి వెళ్లిన నేతల పిలుపు మేరకు 1947 సెప్టెంబర్ 2న అనేక గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు పరకాలకు తరలివచ్చారు. అప్పటికే ఇక్కడ నిజాం పోలీసులు మకాం వేశారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది అమరులయ్యారు. రజాకారులు వెంటాడి 180 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. మొగుళ్లపల్లి మండలం రంగాపురంలో ముగ్గురిని చెట్టుకు కట్టేసి కాల్చిచంపారు. చంద్రగిరి గు ట్టలను కేంద్రంగా చేసుకుని సా యుధ పోరాటం జరిపారు. మరో జలియన్‌వాలాబాగ్ ఘటనను కళ్లకు కట్టినట్లు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, చెన్నమనేని విద్యాసాగర్‌రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ తరఫున వందలాది విగ్రహాలను తయారు చేయించారు. పరకాల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రెండేళ్లుగా శ్రమించి 2003 సెప్టెంబర్ 17 ఆ విగ్రహాలతో ఏర్పాటు చేసిన అమరధామాన్ని ఆయన ప్రారంభించారు.
చరిత్రకు సాక్ష్యం ‘జనగామ రైల్వేస్టేషన్
జనగామ: దొరల ఆగడాలకు చరమగీతం పాడింది జనగామ రైల్వేస్టేషన్. విస్నూరు దొర లష్కర్ (సికింద్రాబాద్)కు పారిపోయే ప్రయత్నంలో సాయుధ పోరాట యోధులు మట్టుబెట్టి తమ వీరత్వాన్ని చాటుకున్నారు. విస్నూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి కొడుకు బాబు దొర అరాచకాలు మితిమీరిపోయాయి. 1947లో సవారు కచ్చురంలో నలుగురు విప్లవకారుల కాళ్లు, చేతులను కట్టేసి తన గూండాలతో గడ్డివాములో తలదాచుకుని తెల్లవారు జామున 4 గంటల వరకు లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చేరుకున్నాడు. ఊరి శివారున ఉన్న ఈత చెట్ల సమీపంలో ముగ్గురిని చంపేశాడు. ఇందులో ఓ ఉద్యమకారుడు చాకచక్యంగా తప్పించుకుని, కుందారం గ్రామానికి చేరుకుని జరిగిన ఘటనను స్థానికులకు వివరించాడు. దీంతో పదివేల మందికిపైగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దొర పోలీస్ స్టేషన్‌లో తలదాచుకుని రైల్వేస్టేషన్ సమీపంలోని పాత ఎస్‌బీహెచ్ ఆవరణలో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విప్లవ యోధుడు గబ్బెట తిరుమల్‌రెడ్డి నాయకత్వంలో జాటోత్ దరాగ్యనాయక్, మరికొందరు విప్లవకారులు నాటి రైల్వే వ్యాగన్ ఏరియాలో దొర రాకకోసం ఎదురు చూశారు. పట్టాలపై ఆగిఉన్న గూడ్స్ రైలు కింది నుంచి దాటుకుంటూ వ్యాగన్ పాయింట్ మర్రిచెట్టు కిందకు రాగానే దరాగ్యనాయక్.. దొర మెడపై మొదటి వేటు వేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. విప్లవకారులు దొరను చిత్రహింసలు పెట్టి చంపేశారు. అనంతరం ప్రజలు సంబురాలు చేసుకున్నారు. దొరకు చరమగీతం పలికిన రైల్వేస్టేషన్ నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
పోలీసు ఉద్యోగం వదిలి..
మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన రేగూరి చంద్రారెడ్డి నాడు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేశారు. పోలీసు ఉద్యోగం మానేసి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పరకాల కేంద్రంగా సాయుధ పోరాటం చేసిన యోధుల్లో చివరగా మిగిలిన.. ఆయన ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు.