
నగరం.. అంధకారం
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలో అంధకారం అలుముకుంది. విద్యుత్ దీపాలు లేని కాలనీలు చాలా ఉన్నాయి. చీకట్లో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించి ఐదేళ్ల కిందట కన్జర్వేషన్ అవార్డు దక్కించుకున్న గ్రేటర్ వరంగల్ ప్రతిష్ట ఏడాదికేడాది మసకబారుతోంది. సంప్రదాయ ఇంధన తయారీ, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ ఎనర్జీ ఎఫీషిఝెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) ద్వారా ఆధునిక విధానాలను అవలంబించిన ఘనత.. నేడు వరంగల్ నగరం అంధకారంలోకి చేరువైంది. విలీన గ్రామాల్లో, నగర శివారు ప్రాంతాల్లో కనీసం విద్యుత్ వీధిదీపాలు లేకపోగా.. ప్రధాన, అంతర్గత రహదారుల్లో చీమ్మచీకట్లు రాజ్యమేలుతున్నాయి. కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు, దీపాల మరమ్మతులపై గ్రేటర్ వరంగల్ నీమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. విద్యుత్ బకాయిలు రూ.10 కోట్లు చెల్లించడం లేదని ఈఈఎస్‌ఎల్ ఏజెన్సీ ఆర్నెళ్లుగా మరమ్మతులపై చేతులెత్తేసింది. దీంతో నగరంలోని 15 శాతం కాలనీలో చీకట్లో మగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఈనెల 15న విద్యుత్ సంస్కరణలపై ప్రత్యేకంగా సమావేశమై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంప్రదాయబద్ధమైన సోలార్ పవర్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలని స్థానిక సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి విద్యుత్ లైట్‌ను కూడా కమాండ్ కంట్రోల్ సిస్టంకు అనుసంధానం చేయాలని, వీధి దీపాల నిర్వహణను ప్రత్యేకంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకోసం జిల్లాకు సంబంధించిన అదనపు కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో వీధి దీపాల నిర్వహణ మెరుగుపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
15 శాతం కాలనీల్లో వెలుగులు కరువు
దశాబ్దంన్నర క్రితం 110 చదరపు కిలోమీటర్ల నుంచి 508 చదరపు కిలో మీటర్లతో విస్తరించిన మహా నగరంలో 15 శాతం కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి. ముఖ్యంగా విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాల్లేవు. ఒకవేళ ఉన్నా రాత్రి వేళ వెలుగులు కరువయ్యాయి. దీంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు, అదుపు తప్పిపోవడం, వీధి కుక్కల గుంపులతో ప్రమాదాల బారినపడి కొంతమంది మృత్యువాతపడ్డారు. మరికొందరు క్షత్రగాత్రులుగా మారి ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా రాంపూర్ రోడ్డులో ఓ డెస్క్ జర్నలిస్టు చీకటిలో వాహనం అదుపు తప్పి గాయాలపాలయ్యాడు. వరంగల్ 18వ డివిజన్‌లోని బర్కత్‌పురలో వీధి కుక్కల కాటుతో ఒకరు ప్రాణాపాయ స్థితి లో కొట్టుమిట్టడుతున్నాడు. ఇలా రాత్రివేళ బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు.
ఇవిగో ఫిర్యాదులు
తమ కాలనీల్లో వీధిలైట్లు వెలగడం లేదని, విద్యుత్ స్తంభాలు లేవని మూడు నెలల వ్యవధిలో ప్రజలు అధికారులకు 863 ఫిర్యాదులు అందించారు. అందులో కేవలం 160 లైట్లను మరమ్మతు చేశారు. కొద్ది నెలలుగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో వీధి లైట్లు, సెంట్రల్ లైటింగ్, హైమాస్ట్ లైట్లు, ఇతర లైట్లు వెలగడం లేదని 4,500 ఫిర్యాదులు అందజేశారంటే విద్యుత్ లైట్ల నిర్వహణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం తీసుకున్న నిర్ణయాలతో విద్యుత్ పొదుపు, వెలుగులు వెదజల్లుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.
ప్రతిపాదనలు అందజేస్తున్నాం..
విద్యుత్ స్తంభాలు, లైట్లు వెలగడం లేదనే ఫిర్యాదులు వస్తున్నది వాస్తవమే. కొత్తగా విద్యుత్ స్తంభాలు అవసరమైన మేర ప్రతిపాదనలు అందజేస్తున్నాం. ఇక బకాయిలు చెల్లించడం లేదని ఈఈఎస్‌ఎల్ నిర్వాహకులు మరమ్మత్తులను నిలిపివేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో మరమ్మతులు చేస్తున్నాం.
– కార్తీక్‌రెడ్డి, బల్దియా ఎలక్ట్రికల్ డీఈ
వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు
విలీన గ్రామాలు, నగర శివారు
ప్రాంతాల్లో చిమ్మచీకట్లు
మరమ్మతులపై చేతులెత్తేసిన ఈఈఎస్‌ఎల్ సంస్థ
పట్టించుకోని బల్దియా యంత్రాంగం
వీధిలైట్లు, సిబ్బంది వివరాలు..
మొత్తం డివిజన్లు: 66
లైట్లు మొత్తం : 74,721
18వాట్ల ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లు: 56,447
20వాట్ల ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లు: 1,400
35వాట్ల ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లు : 2,947
40వాట్ల ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లు: 60
70వాట్ల ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లు: 4,067
110వాట్ల ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లు: 5,158
120 వాట్ల సీఎల్ లైట్లు 1,192
120వాట్ల ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లు: 275
150వాట్ల ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లు: 24
190వాట్ల ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లు: 626
200 వాట్ల ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లు 50
ఔట్ సోర్సింగ్ కార్మికులు : 60–80 మంది
ఇద్దరు ఏఈలు, ఈఈ
విద్యుత్ బిల్లు ఏడాదికి రూ.8 కోట్లు