
బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
గ్రేటర్ వరంగల్ కమిషనర్
చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్/హన్మకొండ కల్చరల్: బతుకమ్మ పండుగ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులు ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులతో బతుకమ్మ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బల్దియా పరిధి హనుమకొండలో 26 ప్రాంతాల్లో వరంగల్ పరిధిలో 20 ప్రాంతాలను బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవడానికి ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో శానిటేషన్‌లో భాగంగా బతుకమ్మ ఆడే ప్రాంతాలను శుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్ లైటింగ్ వెలుగులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాపాలన దినోత్సవం (తెలంగాణ విమోచన దినం) సందర్భంగా బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో మేయర్ జెండాను ఎగురవేస్తారని అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు.
వెయ్యి స్తంభాల ఆలయ పరిశీలన
వెయ్యి స్తంభాల ఆలయంలో కమిషనర్ ‘కుడా’ బల్దియా అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి ఈనెల 21న ఆలయంలో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. వేడుకల్లో భాగస్వామ్యమయ్యే మహిళలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ‘కుడా’ సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, బల్దియా ఈఈ రవికుమార్, భీమ్‌రావు, డీఈలు సారంగం, ఏఈలు, శానిటరీ సూపర్‌వైజర్లు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.