
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ‘కుడా’ చైర్మన్
నయీంనగర్: ‘కుడా’ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సంవత్సర కాలంలో చేపట్టిన ప్రగతి నివేదికను అందించారు. వరంగల్‌ను స్మార్ట్ సిటీగా మార్చడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం గ్రీవెన్స్ సెల్‌ను నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వరంగల్ కలెక్టరేట్‌లో..
న్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు.
నేటినుంచి ప్రైవేట్ కళాశాలలు బంద్
కేయూ క్యాంపస్: ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో తెలంగాణలో ఈనెల 15 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ, లా ఇతర వివిధ ప్రొఫెషనల్స్ కోర్సుల ప్రైవేట్ కళాశాలలు, 16 నుంచి డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్‌ను ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో తాము కళాశాలలు నడిపే పరిస్థితిలో లేమని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. కేయూ పరిధి ఆయా కళాశాలలు కూడా నిరవధికంగా బంద్ చేస్తుండడంతో వర్సిటీ పరిఽధిలో ఇప్పటికే కొనసాగుతున్న వివిధ పరీక్షలు ప్రైవేట్ కళాశాలల నుంచి ప్రభుత్వ యాజమాన్యాల కళాశాలలకు పరీక్ష కేంద్రాలను మారుస్తూ ఆదివారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ వెల్లడించారు.
కేంద్రాల మార్పు ఇలా..
ఈనెల 15న హనుమకొండ హంటర్ రోడ్డులోని అల్లూరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ పరీక్ష కేంద్రంలో జరగాల్సిన ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల ఆరో సెమిస్టర్ పరీక్షను హనుమకొండలోని సుబేదారి వర్సిటీ మహిళా పీజీ కాలేజీ పరీక్ష కేంద్రానికి మార్చారు. ఈనెల 15, 17, 19 తేదీల్లో జరగాల్సిన ఫార్మ్ డీ మొదటి సంవత్సరం పరీక్ష కేంద్రాలను మారుస్తూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల మార్పు వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీఇన్‌లో చూ డొచ్చని పేర్కొన్నారు.
ఎల్కతుర్తి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఆదివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నిర్వహించారు. ముఖ్య అతిథిగా కర్రె భిక్షపతి హాజరై మాట్లాడారు. తెలంగాణలో నైజాం రాజుల నిరంకుశ, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఎదురుతిరిగారని తెలిపారు. ఆనాటి పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు అమరులయ్యారని వివరించారు. 3వేల గ్రామాలను విముక్తి చేసి, 10 లక్షల ఎకరాలను భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకొని పేదలకు పంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆదరి శ్రీనివాస్, నాయకులు మంచాల రమాదేవి, సుంచు కుమారస్వామి, బాలరాజు, రవి, కిషన్, ఉపేందర్, రాధిక, ఐలమ్మ తదితరులున్నారు.
పాకాలలో సందడి
ఖానాపురం: మండలంలోని పాకాలలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మత్తడితో పాటు తూము ద్వారా లీకేజీ నీటిలో జలకాలాడుతూ ఉత్సాహంగా గడిపారు.

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ‘కుడా’ చైర్మన్