
అలంకారప్రాయంగా ఎఫ్‌సీఐ క్వార్టర్లు
కాజీపేట: కాజీపేట భారత ఆహారసంస్థ (ఎఫ్‌సీఐ) గిడ్డంగుల్లో పనిచేసే ఉద్యోగుల కోసం నిర్మించిన నివాస గృహలు (క్వార్టర్లు) నిరూపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. 62వ డివిజన్ రహమత్ నగర్ కాలనీ శివారులో ఉన్న గృహలు ఉపయోగంలో లేక పాములు, తేళ్లకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఈ గృహల్లో ఎవరూ ఉండకపోవడం వల్ల నిర్వహణ లేక పరిసర ప్రాంతాలు అస్థవ్యస్తంగా మారాయి. చెట్లు, చెదారం పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నాయి. వీటివల్ల ఇళ్లలో ఉండలేకపోతున్నామని విష్ణుపురి, రహమత్‌నగర్ కాలనీవాసులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 1995లో ఎఫ్‌సీఐలో పనిచేసే ఉద్యోగుల కోసం రూ.2 కోట్లకుపైగా వ్యయం చేసి 40 కుటుంబాలు నివాసం ఉండేలా 5 భవనాలు నిర్మించారు. ఒక్కో క్వార్టర్‌లో 8 కుటుంబాలు ఉండేలా అందమైన భవనాలు నిర్మించారు. పక్కనే ఎఫ్‌సీఐ ఉండడంతో నిత్యం లక్క పురుగులు రావడం, ఇంటి అద్దె హెచ్‌ఆర్‌ఎ కంటే ఎక్కువగా ఉండడంతో ఈ క్వార్టర్లలో ఉండడానికి సిబ్బంది ససేమిరా అంటున్నారు.