
వెంటాడుతున్న వీధికుక్కలు
ఖిలా వరంగల్: వరంగల్ 39వ డివిజన్ విద్యానగర్ కాలనీలో వీధి కుక్కలు పెట్రేగిపోతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒంటరిగా కనిపిస్తే చాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడుతున్నాయి. కుక్కల దాడిలో ఇప్పటికే కొందరు పిల్లలు గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కాగా.. వరంగల్ ఫోర్ట్ రోడ్డుకు ఇరువైపులా చికెన్, మటన్ విక్రయ షాపులు ఉన్నాయి. రహదారులపై మాంసం వ్యర్థాలు, చెత్త వేస్తుండడంతో వీధి శునకాలు ఎక్కువగా వాటి కోసం గుంపులుగా తిరుగుతున్నాయి. వీధి కుక్కలను సంరక్షణ కేంద్రానికి తరలించాలని బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా బేఖాతర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు.