
నేరస్తులకు భయం కలిగించాలి : సీపీ
వరంగల్ క్రైం: ఏదైనా నేరం చేస్తే కోర్టులో శిక్ష పడుతుందనే భయాన్ని నేరస్తులకు కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ న్యాయస్థానాల్లో జరిగిన ట్రయల్స్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల అభినందన సభను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని నిందితులకు కోర్టులో శిక్షలు పడడంలో కృషి చేసిన జాయింట్ డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దర్యాప్తు అధికారులు, కోర్టు, ప్రాసెస్ విధులు నిర్వహించే పోలీస్ అధికా రులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించి ప్రశంస పత్రాలు అందజేశారు.
పెరిగిన శిక్షల శాతం
ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు చేసిన వారికి కోర్టుల్లో పడిన శిక్షల శాతం పెరిగిందన్నారు. ట్రయల్ కేసుల్లో మొత్తం 16 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, ఇందులో 6 హత్య కేసులు, 5 కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడగా, ఒక కేసులో పదేళ్ల జైలు శిక్షను కోర్టు విధించినట్లు తెలిపారు. నాలుగు అత్యాచారం కేసుల్లో రెండు కేసుల్లో జీవితఖైదు, మరో రెండు కేసుల్లో ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించగా, ఎస్టీ, ఎస్సీ మానభంగం కేసులో ఏడేళ్లు, చోరీ, ఇతర కేసులకు సంబంధించి ఐదు కేసుల్లో మూడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, వరంగల్ ప్రాసిక్యూషన్ ఆఫ్ జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ రాములు, సంగారెడ్డి జిల్లా ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ, సీసీ ఆర్‌బీ ఏసీపీ డేవిడ్ రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సంతోషి, శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, పావని, రాజ మల్లారెడ్డి, దుర్గాబాయి, భరోసా కేంద్రం న్యాయధికారి నీరజ, ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్, ముస్కా శ్రీనివాస్, రవికుమార్, కరుణాకర్, పుల్యాల కిషన్, ఎస్‌ఐ నర్సింహరావుతో పాటు సీసీఆర్‌బీ సిబ్బంది, కోర్టు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.