
చదువు.. క్రీడలు..
ఏషియన్ పారా తైక్వాండో పోటీల్లో రీసెర్చ్ స్కాలర్ కృష్ణవేణి ప్రతిభ
కేయూ క్యాంపస్: మలేషియాలో గత నెల30, 31తేదీల్లో నిర్వహించిన ఏషియన్ పారా తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల్లో కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్‌మేనేజ్‌మెంట్ విభాగం పరిశోధకురాలు మాచర్ల కృష్ణవేణి కాంస్య పతకం సాధించారు. భారతదేశం తరఫున పాల్గొన్న ఆమె ఇండియన్ పారా తైక్వాండో ప్రెసిడెంట్ వీణ చేతులమీదుగా పతకం అందుకున్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ఎల్లగౌడ్ – హైమావతి దంపతుల కుమార్తె కృష్ణవేణి. తండ్రి ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. కృష్ణవేణి హనుమకొండ సుబేదారిలోని దివ్యాంగుల హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నారు. మరోవైపు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. తైక్వాండో పోటీలకు ఆన్‌లైన్‌లోనే ఈ.గణేష్ కోచింగ్ ఇస్తుండగా, జనగామలోని తైక్వాండో కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.
ఆర్థిక సహకారంతో ఏషియన్ పోటీలకు..
మలేషియాలో ఏషియన్ పారా ౖతైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు మాచర్ల కృష్ణవేణికి ఆర్థికపరమైన సమస్య ఏర్పడగా కాకతీయ యూనివర్సిటీ నుంచి అధికారులు రూ.25వేలు అందజేశారు. కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాలోని ప్రవాస భారతీయులు, ఆ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎన్.శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ గిరిగౌడ్, డాక్టర్ అతికం శ్రీనివాస్‌గౌడ్ కలిపి రూ.1.40లక్షలు అందించారు. దాతల ఆర్థికసాయంతో ఏషియన్ పారా తైక్వాండో పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొని ప్రతిభ చూపి కాంస్య పతకం సాఽధించిన కృష్ణవేణికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అంతర్జాతీయ, జాతీయస్థాయి పోటీల్లోనూ..
గతేడాది 2024లో కాంబోడియాలో నిర్వహించిన అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీల్లోనూ బంగారు పతకం సాధించారు. అలాగే, గత మార్చిలో ఫస్ట్ ఏషియన్ పారా త్రోబాల్ చాంపియన్ షిప్‌లో కాంస్యపతకం సాధించారు. చిన్నప్పటినుంచి చదువుతోపాటు వివిధ క్రీడాపోటీల్లో పాల్గొంటున్న కృష్ణవేణి పారా సిట్టింగ్ వాల్‌బాల్‌లోనూ ప్రతిభ చూపుతున్నారు. 2021లో కర్ణాటక ఉడిపిలో జరిగిన జాతీ యస్థాయి సిట్టింగ్ వాలీబాల్ పొటీల్లో, 2024 మా ర్చిలో రాజస్థాన్‌లో జరిగిన జాతీయస్థాయి సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో, తమిళనాడు ఈరోడ్‌లో జరిగిన సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లోనూ ప్రతిభ చూపారు.
కృష్ణవేణి కామర్స్‌విభాగంలో పరిశోధకురాలు..
కాకతీయ యూనివర్సిటీలోనే కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో పీజీ కోర్సు చేశాక మూడేళ్లుగా ఇదే విభాగంలో పరిశోధకురాలుగా పీహెచ్‌డీ చేస్తున్నారు. ‘ప్రాబ్లమ్స్ ఆండ్ ప్రాస్పెక్టివ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్విస్ట్‌మెంట్ ఇన్‌ఇండియా ఏ స్టడీ’ అనే అంశంపై ఆ విభాగం ప్రొఫెసర్ నర్సింహాచారి పర్యవేక్షణలో పరిశోధన సాగిస్తున్నారు.
అభినందించిన వీసీ, రిజిస్ట్రార్
క్రీడాకారిణి మాచర్ల కృష్ణవేణిని సోమవారం యూని వర్సిటీలో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం శాలువా కప్పి సన్మానించారు. జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణవేణి క్రీడల్లో రాణిస్తూ పతకాలు సాధిస్తూ విశ్వవిద్యాలయానికి గర్వకారణంగా నిలుస్తున్నారన్నారు. ఇత ర విద్యార్థులకు ప్రేరణగా నిలిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ పి.అమరవేణి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య, దివ్యాంగుల సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.రాజు, తదితరులు పాల్గొన్నారు.
అభినందించిన వీసీ, రిజిస్ట్రార్

చదువు.. క్రీడలు..