
అదుపు తప్పిన బైక్..
● ఫర్టిలైజర్ నిర్వాహకుడి దుర్మరణం
హసన్‌పర్తి: బైక్ అదుపు తప్పిన ఘటనలో ఓ ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామారం సమీపంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన సాంబశివరావు(46) స్థానికంగా లక్ష్మీ పేరుతో ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం వ్యక్తిగత పనుల నిమిత్తం శనిగరంనుంచి హనుమకొండ వైపునకు బయల్దేరాడు. రామారం వద్దకు చేరుకోగానే బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో సాంబశివరావు అక్కడకక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎం మార్చురీలో భద్రపరిచిన సాంబశివరావు మృతదేహాన్ని ఫర్టిలైజర్ అసోసియేషన్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. సాంబశివరావు కుటుంబానికి తమ అసోసియేషన్ అండగా ఉంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకన్న తెలిపారు. నివాళులర్పించిన వారిలో లెక్కల పున్నంచందర్‌రెడ్డి ఉన్నారు.
రుస్తాపూర్‌లో యువకుడు..
తుర్కపల్లి: బైక్‌పై వెళ్తుండగా గేదె అడ్డు రావడంతో అదుపుతప్పి కిందపడి ఓ యవకుడు మృతిచెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ పట్టణానికి చెందిన దేవరకొండ రాకేశ్(28) భువనగిరి పట్టణ కేంద్రంలోని యాక్సిస్ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం తన సహ ఉద్యోగి హరీశ్‌తో కలిసి తుర్కపల్లి మండల కేంద్రంలో ఓ కస్టమర్‌ను కలిసి అతడితో మాట్లాడి తిరిగి భువనగిరికి బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామ పరిధిలో అకస్మాత్తుగా గేదె రోడ్డుకు అడ్డంగా రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. బైక్‌పై వెనుక కూర్చున్న రాకేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బైక్ నడుపుతున్న హరీశ్ హెల్మెట్ ధరించడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతుడి భార్య శ్రీజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తక్యుద్దీన్ తెలిపారు.

అదుపు తప్పిన బైక్..