
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపురం మండలం మర్రిపల్లిగూడెనికి చెందిన యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమిరె నర్సింహులు పెద్ద కుమారుడు రాజ్‌కుమార్ (25) తల్లిదండ్రుల మాట వినకుండా స్నేహితులతో తిరుగుతున్నాడు. పని చేయకుండా ఎందుకు తిరుగుతున్నావని, ఏదైనా పని చేయమని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజ్‌కుమార్ ఆదివారం మద్యం తాగి అదే మత్తులో గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి విషయాన్ని బంధువులకు చెప్పాడు. వెంటనే నర్సింహులు తన బంధువులతో కలిసి రాజ్‌కుమార్‌ను వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.
తల్లిదండ్రుల గొడవతో హోంగార్డు..
దుగ్గొండి : తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని కల త చెందిన హోంగార్డు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బల్వంతాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన దానం మల్లేశం, విజయ దంపతులు వ్యవసాయం చేస్తు జీవిస్తున్నారు. ఈ క్రమంలో పంటలు పండక రూ.6 లక్షల వరకు అప్పులయ్యాయి. ఆదివారం సాయంత్రం దంపతులు గొడవ పడ్డారు. హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కుమారుడు నాగరాజు (34) ఇద్దరికి సమాధానం చెప్పలేక విరక్తి చెంది గడ్డిమందు తాగి నిద్రించాడు. సోమవారం ఉదయం శ్వాసతీసుకోవడం కష్టం కావడంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో తాను పురుగుల మందు తాగానని చెప్పడంతో వరంగల్ లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, నాగరాజు దుగ్గొండి పోలీ స్‌స్టేషన్‌లో పదేళ్లుగా హోంగార్డుగా విధులు నిర్వర్తించాడు. ఇటీవల బదిలీపై గీసుగొండకు వెళ్లాడు.
మద్యానికి బానిసై.. ఉరేసుకుని..
జఫర్‌గఢ్ : మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తీగారంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై రామ్‌చరణ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అబ్బరబోయిన రాజు (39) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఏ పని చేయకుండా ఉంటున్నాడు. ఎందుకు తాగుతున్నావని తండ్రి వెంకటయ్య మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజు.. వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో పని చేయమని తండ్రి మందలించా డని గడ్డి మందుతాగి కుమారుడు, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బల్వంతాపురం గ్రామంలో తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని హోంగార్డు, జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తీగారం గ్రామంలో మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.

వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య