
తప్పిన పెనుప్రమాదం..
ఎంజీఎం : 65 ఏళ్ల క్రితం నిర్మాణం.. 10 ఏళ్లగా ప్రమాదపుటంచుల్లో కొనసాగుతున్న భవనం.. విద్యార్థులు, అధ్యాపకులు భవనం పైపెచ్చులు కూలడంతో పలుమార్లు గాయాలపాలైన ఘటనలు ఉన్నాయి. ఈ ప్రమాద పరిస్థితిపై అధికారులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు నివేదిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో గతేడాది వర్షాకాలం ప్రారంభంలోనే రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా ఈ భవనాన్ని సందర్శించారు. ఏ ప్రమాదం జరగకముందే హుటాహుటిన విద్యార్థులను వేరే ప్రదేశానికి తరలించాలని నిర్ణయించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. వరంగల్‌లోని రామ్‌కీ అపార్ట్‌మెంట్‌లో వసతి కల్పించేందుకు స్థలం ఎంపిక చేశారు. కానీ ప్రభుత్వం నుంచి నిధులపై స్పందన రాకపోవడంతో అదే శిఽథిలావస్థకు చేరిన ప్రమాదపు భవనంలో 200 మంది నర్సింగ్ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పెద్దఎత్తున స్కూల్ భవనంపై పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో విద్యార్థుల ఎవరూ లేకపోవడంతో అధికారులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
67 ఏళ్ల క్రితం భవనం..
ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలోని నర్సింగ్ స్కూల్‌లో 180 మంది విద్యార్థులు జీఎన్‌ఎం కోర్సు అభ్యసిస్తున్నారు. కాగా, నర్సింగ్ విద్యార్థుల కోసం 1958లో రెండు అంతస్తుల భవనం నిర్మించారు. ఈ భవనంలో సుమారు 50 హాస్టల్ గదులు, 60 మంది విద్యార్థులకు సరిపడేలా మూడు తరగతి గదులు, కిచెన్‌తో పాటు మెస్ సౌకర్యం ఉంది. అయితే ఈ భవనం గత 10 నుంచి 15 ఏళ్లుగా శిథిలావస్థకు చేరి ఎక్కడ చూసి పెచ్చులు ఊడి, పాకురు పట్టి ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితిలో కొనసాగుతోంది. ఈ భవనంలో విద్యాసంస్థను కొనసాగించడమంటే ప్రాణాలతో చెలగాటమాడడమేనని కలెక్టర్ కూడా తన సందర్శనలో గుర్తించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎవరైనా విద్యార్థినీ, అధ్యాపక బృందం ప్రాణాలు కోల్పోతే కాని అధికారులు స్పందించారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎంజీఎంలో కూలిన నర్సింగ్ స్కూల్ భవనం పైపెచ్చులు
ఆ సమయంలో విద్యార్థులు
లేకపోవడంతో తప్పిన ముప్పు
ఊపిరి పీల్చుకున్న అధికారులు,
విద్యార్థులు
తరగతులు, హాస్టళ్ల నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు
సెలవురోజు కావడంతో తప్పిన పెనుముప్పు
నర్సింగ్ స్కూల్ భవనం పై పెచ్చు ఊడిన సమయం రాత్రి వేళ అవ్వడంతోపాటు ఆ రోజు ఆదివారం సెలవు కావడంతో పెను ముప్పు తప్పింది. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు ఊపిరి పీల్చుకున్నారు. పై పెచ్చులు ఊడి కిందపడిన ఘటనను చూసే ఆ సమయంలో ఉంటే కచ్చితంగా ఆ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయేవారని ఆ ఘటనను చూస్తే అర్థమవుతుంది.
డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాం..
నర్సింగ్ స్కూల్ భవనం, ఆస్పత్రుల్లో శిథిలావస్థకు చేరి పై పెచ్చులు భవన పరిస్థితులను ఎప్పటికప్పుడు కలెక్టర్, డీఎంఈకి వివరిస్తున్నాం. ప్రస్తుతం భవన నిర్మాణం మరమ్మతులను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. విద్యార్థులకు ప్రస్తుతం వసతి, బోధన కొనసాగించాలా.. లేదా అనే అంశాలను కలెక్టర్, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
– కిశోర్,
సూపరింటెండెంట్, ఎంజీఎం

తప్పిన పెనుప్రమాదం..

తప్పిన పెనుప్రమాదం..

తప్పిన పెనుప్రమాదం..