వివిధ విద్యార్థి సంఘాలు, సినీ నటుడు నారాయణమూర్తి విజ్ఞప్తి
నయీంనగర్: ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్నేహ చిత్ర పిక్చర్స్‌లో తెరకెక్కిన ‘యూనివర్సిటీ పేపర్ లీకేజీ’ చిత్రాన్ని ఆదరించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులు ప్రేక్షకులను కోరారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ పేపర్ లీకేజీ’ సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ దశాబ్దాలుగా పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్టు ఈ చిత్రం తీశారని, ప్రేక్షలు ఆదరించాలని కోరారు. అనంతరం నారాయణమూర్తి మాట్లాడుతూ ఈ రోజుల్లో పేపర్ లీకేజీ వ్యవహారం సర్వసాధారణంగా మారిందన్నారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడమంటే సమాజాన్ని నాశనం చేయడమే అన్నారు. నేడు చదువు కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకుందని, చదువుకునే రోజుల నుంచి చదువు కొనుక్కునే పరిస్థితులు దాపురించాయని, ఈ విషయాలు చిత్రంలో వివరించామన్నారు. సేవా రంగంగా ఉండాల్సిన విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చారని మండిపడ్డారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బాషబోయిన సంతోష్, రంజిత్ కుమార్, సాయి,వేల్పుల చరణ్, రవితేజ, వినయ్, వంశీకృష్ణ, విజయ్, కల్యాణ్, వినయ్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు.