
గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి
హన్మకొండ అర్బన్: అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో మహిళలు, పిల్లలు, దివ్యాగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అనుబంధ విభాగాలు, శాఖాపరమైన అంశాలపై సమీక్షించారు. గర్భిణుల బరువు, రక్తశాతం వివరాలను నమోదు చేయాలన్నారు. బాలల పరిరక్షణ విభాగం, శిశు గృహకు సంబంధించిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సత్వరమే చర్యలకు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
త్వరగా పరిష్కరించండి
భూభారతి సదస్సులో ప్రజల నుంచి స్వీకరించిన వినతులు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారత దరఖాస్తులకు ఆన్‌లైన్‌లో నోటీసులు తయారు చేసి గ్రామాల వారీగా జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి జె.జయంతి, సీడీపీఓలు విశ్వజ, స్వాతి, బాలరక్షా భవన్ కో–ఆర్డినేటర్ సీహెచ్.అవంతి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్‌చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్‌కుమార్, చైల్డ్ లైన్ కో–ఆర్డినేటర్ భాస్కర్, పోషణ అభియాన్ కో–ఆర్డినేటర్ సుమలత, పర్యవేక్షణ అధికారులు భాగ్యలక్ష్మి, కళ్యాణి, సరిత, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
అధికారులతో సమీక్ష