
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా కృషి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య, అనుబంధ శాఖలతో సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్యకేంద్రాలు, బస్తీ, పల్లె దవా ఖానలు, 108, టీహబ్ పనితీరుపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్‌రావు, ఇమ్యునైజేషన్ అధికారి మహేందర్, టీబీ అధికారి హిమబిందు, ప్రోగాం అధికారులు డాక్టర్ ఇక్తేదార్, డాక్టర్ మంజుల, డెమో అశోక్‌రెడ్డి, 108 కో–ఆర్డినేటర్ శ్రీనివాస్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.
అర్హులను త్వరగా ఎంపిక చేయాలి..
ఇందిర సౌర గిరి జలవికాసం పథకానికి అర్హుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఇందిర సౌర గిరి జల వికాసం పథకంపై ఐటీడీఏ, వ్యవసాయ, ఉద్యాన, గిరిజన సంక్షేమ, డీఆర్డీఏ, అటవీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మండల స్థాయి కమిటీలో అర్హులను ఎంపిక చేసి, కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా కమిటీకి ఎంపిక కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ప్రేమకళ, డీఆర్డీఓ శ్రీను, అధికారులు ఉన్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
హనుమకొండ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు 24 గంటల పాటు సేవలందించేందుకు కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1115కు ఫోన్ చేయాలని సూచించారు.
మెనూ పాటిస్తున్నారా?
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్, సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్, త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. శుక్రవారం హాస్టల్‌లోని బాలబాలికల గదులను, క్రీడాకారులకు అందిస్తున్న మెనూ చార్ట్, వంటగదిని కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా క్రీడాకారుల వసతులపై డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, డీఎస్‌ఏ కోచ్‌లు ఉన్నారు.