
అనుమతి లేని ఆస్పత్రుల్లో తనిఖీ
మడికొండ: అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మడికొండలోని రెండు హాస్పిటళ్లలో టీజీఎంసీ బృందం తనిఖీలు నిర్వహించింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి మడికొండలో తనిఖీలు చేపట్టారు. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదివిన ఇ.జయరాం శ్రీసాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరిట వైద్యం చేస్తున్నాడు. అధికారులు తనిఖీ చేస్తుండగా.. జయరాం భార్య భాగ్యలక్ష్మి తాను లా చదివానంటూ అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. అనుమతి పత్రాలు చూపించమని అడగ్గా చెల్లుబాటు కాని పత్రాలు చూపినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇంటర్ ఫెయిల్ అయిన టి.రాజు మడికొండ జాతీయ రహదారిలో శ్రీజ క్లినిక్ ఏర్పాటు చేసి తాను డాక్టర్‌నని పేర్కొంటూ ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నట్లు గుర్తించారు. అనధికారికంగా హాస్పిటల్ నిర్వహించడంతో పాటు అల్లోపతి, వైద్యం నిర్వహిస్తున్న జయరాం, భాగ్యలక్ష్మి, టి.రాజుపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ వైద్యుల సమాచారం 9154382727 నంబ ర్‌కు వాట్సాప్ ద్వారా తెలపాలని టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ వి.నరేశ్‌కుమార్ కోరారు. తనిఖీల్లో వైద్యాధికారి వెంకటస్వామి పాల్గొన్నారు.