
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ఖజానాకు ఓ ఉద్యోగి పెద్ద కన్నం పెట్టాడు. బదిలీ అయిన కమిషనర్‌కు సీసీగా పని చేసిన సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేశ్ తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2.31 కోట్ల నిధులు కాజేశాడు. రెండేళ్ల తర్వాత ఈఘటన వెలుగు చూసింది. ఎట్టకేలకు సదరు ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. వరంగల్ మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో అతడిపై కేసు నమోదైంది. అన్వేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
బోగస్ పత్రాలు.. ఫోర్జరీ సంతకాలు
2021 మే, జూన్ నెలలో స్మార్ట్‌సిటీ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)లు, ప్రైవేట్ కన్సల్టెంట్ల బిల్లుల చెల్లింపు, గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఖర్చు తదితరాల పేరిట రికార్డు 15–16 బోగస్ పత్రాలు సృష్టించాడు. అప్పటి కమిషనర్ ప్రస్తుతం రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న పమేల సత్పతి సంతకాలను ఫోర్జరీ చేశాడు. కుంభకోణం బయటపడడంతో ఎట్టకేలకు సదరు ఉద్యోగిపై వేటు పడింది. బల్దియాలో కారుణ్య నియామకం కింద విధుల్లో చేరిన బండా అన్వేశ్.. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కమిషనర్ సీసీగా పని చేస్తున్నాడు. చిన్న చిన్న అక్రమ వసూళ్ల జోలికిపోకుండా ఏకంగా.. గ్రేటర్ ఖజానాను కొల్లగొట్టేందుకు పథకం పన్నాడు. 2021 జూన్‌లో గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్, జీ–2 సెక్షన్ ద్వారా వివిధ కార్యక్రమాలు జరిగినట్లు బోగస్ పత్రాలు సృష్టించాడు. అప్పటి కమిషనర్ పమేల సత్పతి పేరిట పరిపాలనాపరమైన మంజూరు ఇచ్చినట్లు, సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది.
అడ్డదారిలో..
బల్దియాకు చెందిన జనరల్ ఫండ్ నుంచి మొత్తం రూ. 2,31 కోట్ల విలువైన బిల్లులు సిద్ధం చేయించిన అన్వేశ్.. అడ్డదారిలో అకౌంటింగ్ విభాగంలో చెక్కు చెల్లింపులు జరిగే విధంగా ఒత్తిళ్లు తెచ్చాడు. థర్డ్ పార్టీ పేరిట ఈసొమ్ము బ్యాంక్‌లో డిపాజిట్ అయ్యేలా ముమ్మర ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఈవిషయం ఆలస్యంగా తెలుసుకున్న బదిలీ అయిన కమిషనర్, పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ పమేల సత్పతి రాష్ట్ర అకౌంట్స్ విభాగం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఎట్టకేలకే ఆయా విభాగం అధికారులు ఆర్న్లెళ్లుగా విచారణ చేపట్టారు. ఈసొమ్ముకు చెందిన స్మార్ట్‌సిటీ డీపీఆర్‌లు, ఎన్నికల ఖర్చు తదితర విషయాలపై వారం రోజులుగా బల్దియాలో వివరాలు సేకరించారు. ఎట్టకేలకే సదరు సీనియర్ అసిస్టెంట్ సొమ్ము స్వాహా చేయడాన్ని అంగీకరించాడు. దీంతో పురపాలక శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, సీనియర్ అసిస్టెంట్ అన్వేశ్‌కు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం వరంగల్ మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో సదరు ఉద్యోగిపై బల్దియా పరిపాలన సూపరింటెండెంట్ చీకటి ఆనంద్, అడిషనల్ కమిషనర్ అనిసుర్ రషీద్ ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు సీనియర్ అసిస్టెంట్ అన్వేశ్‌ను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.