
నిట్‌లో క్యాంపస్ సెలక్షన్స్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్ సెలక్షన్స్ 2025లో 1,201 యూజీ, పీజీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ శుక్రవారం క్యాంపస్ సెలక్షన్స్ వివరాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకతను సాధించుకున్న నిట్ వరంగల్ క్యాంపస్ విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు ఈఏడాది 290కి పైగా.. కంపెనీలు పోటీ పడినట్లు తెలిపారు. నిట్‌కు చెందిన 791 మంది అండర్ గ్రాడ్యుయేట్, 717 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పూర్తిగా 1,508 మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌కు హాజరుకాగా.. 1,201 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలను సాధించారని తెలిపారు. బీటెక్‌లో ఈసీఈ విభాగానికి చెందిన సోమిల్ మాల్‌ధాని అత్యధిక ప్యాకేజీ రూ.64.3 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపిక కాగా.. అత్యల్పంగా రూ.14.35 లక్షల ప్యాకేజీకి, అదే విధంగా పీజీలో రూ.12.20 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికైనట్లు తెలిపారు. గతేడాది క్యాంపస్ సెలక్షన్స్‌లో 76 శాతం ఎంపిక కాగా.. ఈఏడాది 79.7 శాతం విద్యార్థులు ఎంపికవడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది పీహెచ్‌డీ విద్యార్థులు సైతం క్యాంపస్ సెలక్షన్లలో పోటీపడగా.. ఆరుగురు పీహెచ్‌డీ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో రూ.9 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికైనట్లు పేర్కొన్నారు. నిట్‌లో విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ ఎంపికకు సీపీపీడీ (సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్) ప్రత్యేకంగా పని చేస్తుందని తెలిపారు.
సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేస్తా..
మాది జైపూర్. బన్వారీ లాల్ మాల్‌ధానీ, రేణు అగర్వాల్ మా నాన్నఅమ్మ. సాధారణ మధ్య తరగతి కుటుంబం మాది. నిట్ క్యాంపస్ సెలక్షన్స్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో రూ.64.3 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికయ్యా. సాఫ్ట్‌వేర్ కంపెనీనీ ఏర్పాటు చేసి నా తోటి మిత్రులకు ఉపాధి కల్పించాలన్నదే నా లక్ష్యం.
– సోమిల్ మాల్‌ధానీ, ఈసీఈ విభాగం
1,201 మందికి ఉద్యోగాలు
రూ.64.3 లక్షల వార్షిక ప్యాకేజీతో సోమిల్ మాల్‌దానీ

నిట్‌లో క్యాంపస్ సెలక్షన్స్