
ఈ–పాస్ మిషన్లతోనే ఎరువులు విక్రయించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: ఈపాస్ మిషన్లతో ఎరువులను విక్రయించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్ శివనగర్‌లోని సాయి కన్వెన్షన్‌లో రిటైల్ ఎరువుల వ్యాపారులకు శుక్రవారం ఎల్–1 ఈపాస్ మిషన్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యశారద హాజరై డీలర్లకు ఈపాస్ మిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎరువుల శాఖ ఆదేశాల మేరకు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ వారు ప్రస్తుతం ఉన్న ఈపాస్ మిషన్ల స్థానంలో కొత్తగా ఎల్–1 ఈపాస్ మిషన్లను డీలర్లకు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈపాస్ మిషన్లతో ఎరువుల పంపిణీ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, సహాయ సంచాలకులు దామోదర్‌రెడ్డి, నర్సింగం, ఏఓ రవీందర్‌రెడ్డి, టెక్నికల్ ఏఓ కృష్ణారెడ్డి, కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులు సుజనకుమార్, సుమన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉద్యాన సాగును విస్తృతం చేయాలి
న్యూశాయంపేట: రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఉద్యాన సాగును విస్తృతం చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. పండ్ల తోటలు, కూరగాయల సాగు విస్తీర్ణంపై అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అనంతరం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. డీఆర్‌ఓ విజయలక్ష్మి, హార్టికల్చర్ అధికారి అనురాధ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, నాబార్డ్ ఏజీఎం రవి, కేవీకే మామునూరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న పాల్గొన్నారు.
జీపీఓ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
వరంగల్‌లోని ఇస్లామియా జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించనున్న జీపీఓ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జీపీఓ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పరీక్షకు 198 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ, బల్దియా హెల్త్‌ఆఫీసర్ రాజేశ్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అర్షియా తబస్సుమ్, ఏఓ విశ్వప్రసాద్, తహసీల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.