
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు
హన్మకొండ అర్బన్ : అంగన్‌వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ ఇవ్వాలని అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో 10 రోజులుగా చేస్తున్న సమ్మెను ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేరుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్‌జీని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాగుల రమేష్ మాట్లడుతూ అంగన్‌వాడీ ఉద్యోగులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ, సమ్మెను విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేస్తోందన్నారు. అంగన్‌వాడీ సెంటర్ల తాళాలను పగులగొట్టి వాటి నిర్వహణ బాధ్యతలను ఇతరులకు అప్పగించాలనే ప్రయత్నాన్ని ఉద్యోగులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కనీస వేతనం రూ.26 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.10 లక్షలు, ఆయాలకు రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ వ్యవస్థ నిర్వీర్యం చేసేందుకు కేంద్రం బడ్జెట్‌లో క్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తోందని, ఐసీడీఎస్‌ను బలోపేతం చేసేందుకు నిధులను పెంచాలని రమేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గాదె ప్రభాకర్‌రెడ్డి, పుల్లా అశోక్, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు కె.రమాదేవి, జమున, ఎన్.శోభారాణి, సమ్మక్క, పూజారి రమాదేవి, ఎస్.కిరీట, స్వరూపారాణి, నిర్మల, శోభారాణి, శ్రీలేఖ, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి
రాగుల రమేష్
కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ
ఉద్యోగుల ధర్నా