ర్యాగింగ్‌ కింద ఏమేమి వస్తాయంటే.. | - | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌ కింద ఏమేమి వస్తాయంటే..

Sep 20 2023 1:10 AM | Updated on Sep 20 2023 1:10 AM

- - Sakshi

ఎంజీఎం: వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌ రక్కసి మళ్లీ విజృంభిస్తోంది. దాదాపు 1,500 మంది వైద్య విద్యార్థులున్న ఈ కళాశాల ర్యాగింగ్‌ పేరుతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఘటనలు జరిగిన సందర్భంలో సీనియర్లను పిలిచి మందలించినా.. పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఏకంగా కాలేజీ నుంచి ఆర్నెళ్ల పాటు సస్పెండ్‌ చేసిన ఉదంతాలు ఉన్నాయి. కొందరు విద్యార్థులపై పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదై, అరెస్టయిన సందర్భాలూ ఉన్నాయి. పలుకుబడి కలిగిన విద్యార్థులకు ర్యాగింగ్‌ వేధింపులు ఎదురైనప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని, బ్యాక్‌ గ్రౌండ్‌ లేని వారు ఆ బాధలు భరిస్తూ మనకెందుకులే అని సర్దుకొని చదువు సాగిస్తున్నారనే చర్చ కేఎంసీలో వినిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రీతి అనే జూనియర్‌ విద్యార్థి మృతికి సైఫ్‌ అనే సీనియర్‌ విద్యార్థి ర్యాగింగ్‌ కారణమైందని యాంటీ ర్యాగింగ్‌ కమిటీ నిర్ధారించడంతో అతడిపై ఏడాది పాటు సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ నెల 14వ తేదీ రాత్రి జూనియర్‌ విద్యార్థి మనోహర్‌పై ర్యాగింగ్‌ ఘటనలో ఏడుగురు విద్యార్థులపై మూడు నెలలపాటు సస్పెన్షన్‌వేటు వేశారు. కేఎంసీ చరిత్రలో ఒకేసారి ఏడుగురిపై సస్పెన్షన్‌ వేటు పడడం ఇదే మొదటిసారి అని కాలేజీ అధ్యాపకులు చెబుతున్నారు.

గత ర్యాగింగ్‌ ఘటనలు..

2009 ఆగస్టు 6 : అనుమల్ల అచ్యుత కృష్ణ.. కాలేజీలో చేరిన తొలిరోజు ఎనిమిది మంది సీనియర్లు కలిసి ర్యాగింగ్‌ చేశారు. ఈ విషయమై బాధితుడు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా.. ఎనిమిది మందిపై మట్టెవాడ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

2014, ఫిబ్రవరి 13: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థులు పృథ్వీరాజ్‌, అనూష్‌ యాదవ్‌లు.. ఫస్టియర్‌ విద్యార్థిని గాజు ముక్కలపై మోకాళ్ల మీద నడవాలంటూ ర్యాగింగ్‌ చేశారు. ఈఘటనపై ఆ ఇద్దరు విద్యార్థులను ఆర్నెళ్లపాటు సస్పెండ్‌ చేశారు.

2021 సెప్టెంబర్‌ : కేఎంసీ ప్రాంగణంలోని క్రీడా మైదానంలో ఫస్టియర్‌ చదువుతున్న విద్యార్థులతో సీనియర్‌ విద్యార్థుల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సమయంలో గొడవ జరిగింది. ఆ తరువాత జరిగిన ఘర్షణలో రాజస్థాన్‌కు చెందిన ఓ విద్యార్థిని మోకాళ్లపై కూర్చోమనడంతో అతను ఎదురు ప్రశ్నించగా.. బలవంతంగా కూర్చొబెట్టి సిగరెట్‌ తాగుతూ ముఖంపై ఊదారు. దీనిని శాంతియుత వాతావరణంలో మాట్లాడుకున్నట్టు కేఎంసీ వర్గాల ద్వారా తెలిసింది.

● పీజీ వైద్య విద్య అభ్యసించే విద్యార్థులు సైతం వేధింపులకు గురవుతున్న విషయం ప్రీతి ఘటనతోో వెలుగులోకి వచ్చింది. గతేడాది నవంబర్‌లో ప్రీతిని సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ వేధించడంపై ఎంజీఎం అఽధికారులు ఇద్దరికి కౌన్సెలింగ్‌ నిర్వహించిన మరుసటే రోజే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందింది. ఈ ఘటనలో సైఫ్‌ జైలు శిక్షను అనుభవించడంతో పాటు అతడిని ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు.

తాజాగా.. మనోహర్‌ ఘటన

ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి జూనియర్‌ విద్యార్థి మనోహర్‌పై దాదాపు 15 మంది విద్యార్థులు ర్యాగింగ్‌ పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో కళాశాల అంతర్గత కమిటీ 10 మంది ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఏడుగురిపై మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా, మంగళవారం యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సమావేశమై ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురిని 3 నెలలపాటు సస్పెండ్‌ చేసింది. ఏడాదిపాటు హాస్టల్‌ వసతిని నిరాకరిస్తూ తీర్మానం చేసింది.

● సీనియర్లు సూచించిన డ్రెస్‌లనే వేసుకుని రావాలని హుకుం జారీ చేయడం. డ్రెస్‌కోడ్‌ ర్యాగింగ్‌ కొత్తవారికి ఇబ్బందికరంగా, అసౌకర్యంగా అనిపించొచ్చు.

● సీనియర్లకు నచ్చిన భాషల్లో తమను తాము పరిచయం చేసుకోవాలని జూనియర్లపై ఒత్తిడి చేయడం.. ఆ పరిచయంలో కొత్తవారి పేరు, చిరునామా, పాఠశాల, మార్కులు, తల్లిదండ్రుల పేర్లు అడగడంలాంటివి.

● అసభ్యకరమైన పాటలు పాడించడం, బట్టలు విప్పించి నృత్యాలు చేయించడం.

● ర్యాగింగ్‌లో తీవ్రమైనది లైంగికవేధింపులు. ఒకరి శరీర భాగాల శరీర నిర్మాణ సంబంధమైన వర్ణన, అతని లేదా ఆమె లైంగిక అభిరుచులు ఏమిటో చెప్పమనడం, దుస్తులు బలవంతంగా విప్పించడంలాంటివి.

● సినిమా వాళ్లను అనుకరించాలని, సన్నివేశం తీరుగా నటించమని చెప్పడం, చెట్టు ఎక్కమనడం, వ్యతిరేక లింగానికి చెందిన వారికి ప్రపోజ్‌ చేయడం వంటివి.

● గదులను శుభ్రం చేయించడం, దుస్తులు ఉతి కించడం, పాలు తీసుకురావడం నుంచి వారి అసైన్‌మెంట్‌లను పూర్తి చేయడం వరకు..

● బలవంతంగా సిగరెట్‌, మందు తాగించడం, ఇతర డ్రగ్స్‌ను తీసుకోవాలని ఒత్తిడి చేయడం లాంటివి.

ర్యాగింగ్‌ నివారణ ఇలా

ప్రత్యేక హాస్టల్‌లో ఫ్రెషర్‌లను బస చేయడం, ప్రత్యేకించి రాత్రుల్లో యాంటీ ర్యాగింగ్‌ స్క్వాడ్‌ ఆకస్మిక దాడులు, సీనియర్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అఫిడవిట్‌లు సమర్పించడం వంటి కఠినమైన ముందస్తు చర్యలు చేపట్టాలి.

● యాంటీ ర్యాగింగ్‌ సంస్థలు, పోలీస్‌ వ్యవస్థలతో కాలేజీలో అవగాహన డ్రైవ్‌లు ఏర్పాటు చేయాలి.

మెడికల్‌ కాలేజీలో సీనియర్ల దురుసుప్రవర్తన

చర్యలు తీసుకుంటున్నా

ఆగని ఘటనలు

ప్రీతి విషయంలో సైఫ్‌పై ఏడాది వేటు

తాజాగా జూనియర్‌ విద్యార్థి

మనోహర్‌ను వేధించిన సీనియర్లు

ఏడుగురిపై 3 నెలలపాటు సస్పెన్షన్‌ వేటు.. ఏడాది పాటు హాస్టల్‌ నిరాకరణ

సుదీర్ఘ విచారణ అనంతరం నిర్ణయం తీసుకున్న యాంటీర్యాగింగ్‌ కమిటీ

రక్షణ చర్యలు పెంచుతాం

కాలేజీలో సెక్యూరిటీ పెంచుతాం. కాలేజీలో అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. గతంలోనూ రాజస్తాన్‌ విద్యార్థిపై ర్యాగింగ్‌ జరిగింది. తాజా ఘటనలో బాధితుడు కూడా రాజస్థాన్‌ విద్యార్థే. వీరిమధ్య స్నేహతత్వం నెలకొనేందుకు త్వరలో నార్త్‌, సౌత్‌ ఇండియన్‌ విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తా. కళాశాలలో మద్యం సేవించడం లాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటాం.

– మోహన్‌దాస్‌, కేఎంసీ ప్రిన్సిపాల్‌

భవిష్యత్‌ను

నాశనం చేసుకోవద్దు

విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ చట్ట విరుద్ధం. జూనియర్లను ఇతరత్రా కారణాలతో వేధిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. ఒకసారి కేసు నమోదు అయితే వారి భవిష్యత్‌ అంధకారమవుతుంది. క్షణికానందం కోసం ర్యాగింగ్‌లాంటి చర్యలకు పాల్పడి మంచి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. కేఎంసీలో విద్యార్థి మనోహర్‌ను ర్యాగింగ్‌ చేసిన ఏడుగురిని సస్పెండ్‌చేసినా వారిపై పోలీసుల చట్టపరమైన విచారణ కొనసాగుతుంది.

– బోనాల కిషన్‌ ఏసీపీ,

యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సభ్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement