అక్రమ విద్యుత్‌ వినియోగంపై కొరడా | - | Sakshi
Sakshi News home page

అక్రమ విద్యుత్‌ వినియోగంపై కొరడా

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

● 4,212 సర్వీసుల తనిఖీ ● రూ.13.97 లక్షల జరిమానా కాలువలో పడి వ్యక్తి మృతి

కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్‌ శాఖ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గురువారం డీ–3 గుంటూరు సెక్షన్‌ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 53 మంది అధికారులు, 146 మంది సిబ్బంది 53 బృందాలుగా ఏర్పడి మొత్తం 4,212 విద్యుత్‌ సర్వీసలను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఐదుగురు మీటర్లు ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్‌ వినియోగిస్తున్నట్లు గుర్తించి రూ.75 వేలు, మరో ముగ్గురు అనుమతించిన కేటగిరీకి భిన్నంగా విద్యుత్‌ వినియోగించడంతో రూ.60 వేలు జరిమానా విధించారు. అనుమతించిన లోడ్‌కు మించి విద్యుత్‌ వినియోగిస్తున్న 233 మందిపై రూ.12.62 లక్షల అపరాధ రుసుం విధించారు. మొత్తంగా రూ.13.97 లక్షల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్‌ చౌర్యం, అక్రమ వినియోగంపై తనిఖీలు కొనసాగుతాయని అధికారులు వివరించారు. తనిఖీల్లో విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ వెంకటేశ్వరరావు, గుంటూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ పఠాన్‌ హుస్సేన్‌ ఖాన్‌, డీఈఈలు షేక్‌ ముస్తాక్‌ అహ్మద్‌, ఎన్‌.మల్లికార్జునప్రసాద్‌, కె.రవికుమార్‌, ఏఈలు ఎం.చంద్రశేఖర్‌, యు.శివశంకర్‌, ఎం.సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

బదిలీ చేయిస్తానని మోసం

తెనాలిరూరల్‌: ఉద్యోగం బదిలీ చేయిస్తానని డబ్బు తీసుకుని మోసం చేయడంపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన నాగిడి శ్రీనివాసరావు విద్యుత్‌ శాఖలో కాకుమాను సెక్షన్‌లో లైన్‌ మ్యాన్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో కలసి దుగ్గిరాలలో నివసిస్తున్నాడు. తన భార్య అనారోగ్యం కారణంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు శెలవు తీసుకోవాల్సివచ్చింది. దుగ్గిరాలకు దగ్గరగా ఉన్న ప్రదేశానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరాడు. ప్రస్తుతం కుదరదని చెప్పారు. విద్యుత్‌ ఈఈ వద్ద డ్రైవరుగా పని చేసే దినేష్‌రూ. 50 వేలు ఇస్తే బదిలీ చేయిస్తానని చెప్పాడు. నమ్మిన శ్రీనివాసరావు రూ.25 వేలు ఫోన్‌పే చేశాడు. దుగ్గిరాలకే బదిలీ చేయించానని బదిలీ ఉత్తర్వు కాపీని దినేష్‌ శ్రీనివాసరావు వాట్సాప్‌కు పంపాడు. అనుమానం వచ్చి అధికారులను ఆశ్రయించగా నకిలీదని తేలింది. త్రీ టౌన్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు గురువారం నమోదు చేశారు.

క్వారీ బ్లాస్టింగ్‌.. ఒకరికి గాయలు

ఫిరంగిపురం: మండల కేంద్రంలోని తాగునీటి కోనేరు సమీపంలో ఉన్న కొండక్వారీ గురువారం ఉదయం బ్లాస్టింగ్‌ నిర్వహించారు. పేలుడుధాటికి రాళ్లు సమీపంలోని రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో క్లారీ బ్లాస్టింగ్‌ నిర్వహించే పనులు పర్యవేక్షిస్తున్న లీజు దారుడు మాగేష్‌కు ఓ రాయి వచ్చి తలకు తగిలింది. దీంతో గాయం కావడంతో అతడిని కార్మికులు వాహనంలో చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. ఎటువంటి ప్రమాదం లేదని కార్మికులు చెబుతున్నారు.

రోడ్డుపై పడుతున్న రాళ్లు..

క్వారీ వద్ద ప్రతిరోజు రెండు లేక మూడు సార్లు బ్లాస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఫిరంగిపురం నుంచి చిలుకలూరిపేట వెళ్లే రహదారి కావడంతో అనేక వాహనాలు ఆమార్గంలో ప్రయాణిస్తుంటాయి. బ్లాస్టింగ్‌ సమయంలో 30 నుంచి 40 నిమిషాలు వరకు వాహనాలు నిలిపివేస్తుంటారని వాహనదారులు చెబుతున్నారు. ఓ స్టోన్‌ క్రషర్‌కు చెందిన వ్యక్తి నుంచి కర్ణాటకకు చెందిన మాగేష్‌ సబ్‌ లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్లాస్టింగ్‌ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాహన దారులు, ప్రయాణికులు కోరుతున్నారు.

బాలికపై లైంగిక దాడి, కిడ్నాప్‌ కేసులో నిందితుడికి జీవిత ఖైదు

గుంటూరు లీగల్‌: బాలికపై లైంగిక దాడి, కిడ్నాప్‌కు సంబంధించిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతోపాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి షమీ పర్విన్‌ సుల్తానా బేగం గురువారం తీర్పు వెలువరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన మిరియాల జైరావు (28)పై బాలికను కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. కేసును విచారించిన అనంతరం నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి జీవిత ఖైదు, రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. బాధితురాలికి నష్టపరిహారంగా ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షలు చెల్లించే విధంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తీగల దుర్గాప్రసాద్‌ వాదనలు వినిపించారు.

పిడుగురాళ్ల: పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు కెనాల్‌లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పందిటివారిపాలెం గ్రామానికి చెందిన అంచూరి లింగారెడ్డి (48) వినాయకుని నిమజ్జనం సమయంలో జూలకల్లు వెళ్లారు. బుధవారం రాత్రి సమయంలో నిమజ్జనం వేళ కాలు జారి కెనాల్‌లో పడ్డాడు. వెంటనే పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు పోలీసు బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. లింగారెడ్డి మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement