నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, మెరుగైన ఉద్యోగ అవకాశాలతో అనుసంధానం చేసేందుకు అధికారులు, శిక్షణ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, ఎమ్మెల్యే గళ్ల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్లతో కలసి స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌పై అధికారులు, నైపుణ్య శిక్షణ నిర్వాహకులతో పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గుంటూరు జిల్లాకు నిర్దేశించిన 9,000 మంది యువతను నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలతో అనుసంధానం చేసే లక్ష్యాన్ని సమర్థంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హత కలిగిన యువతకు ఈ కార్యక్రమం ద్వారా లభించే శిక్షణ, ఉద్యోగ అవకాశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గుంటూరు పార్లమెంట్‌తోపాటు పల్నాడు, బాపట్ల, ప్రకాశం తదితర సమీప ప్రాంతాల నిరుద్యోగ యువత కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వచ్చే నెల మొదటి వారంలో శిక్షణ

జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యం మేరకు అక్టోబర్‌ మొదటి వారంలో మొదటి విడత శిక్షణ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల స్థాయిలో రిజిస్ట్రేషన్‌ క్యాంపులు నిర్వహించి అర్హులైన నిరుద్యోగ యువతను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో డీఆర్వో షేక్‌ ఖాజావలి, జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి అభినవ్‌, జిల్లా నైపుణ్య శాఖ అధికారి సంజీవరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement