లక్ష్మీపురం: పల్నాడు జిల్లాలోని శ్రీ చక్ర సిమెంట్ పరిశ్రమను కాపాడాలని, అందులో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ సిమెంట్ ఫెడరేషన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగంభవన్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని శ్రీ చక్ర సిమెంట్ పరిశ్రమ ఆక్రమంగా లాకౌట్ ప్రకటించడంతో దశాబ్దాలుగా పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనిపై అనేక దఫాలుగా యాజమాన్యం, కార్మిక శాఖతో చర్చలు జరిగాయని, కానీ యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేసేలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. సిమెంట్ పరిశ్రమలకు వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులకు ఆరోగ్య, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మోహన్ రావు మాట్లాడుతూ శ్రీ చక్ర సిమెంట్ యాజమాన్య వైఖరిపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. యాజమాన్య ఆర్థిక అక్రమ లావాదేవీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల అంజిబాబు, మేడా హనుమంతరావు, శ్రీ చక్ర సిమెంట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్కే గాలిబ్, ఐ.అంజయ్య, ఎన్.వెంకట్రావు, జి.వెంకటేశ్వర్లు, కేపీ శ్రీను, డి.సైదులు, ఓ.బాలరాజు, ఓ.రాజారావు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వెంకట సుబ్బయ్య డిమాండ్


