జిల్లాలో మద్యం దుకాణాల రెన్యూవల్‌తో టీడీపీ నేతలకు కాసులు పాత వారికే షాపులు కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు ‘స్థానిక’ ఎన్నికలకు నిధుల కోసమే ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ?
మినీ బార్లుగా పర్మిట్ రూములు
నెహ్రూనగర్: టీడీపీ సర్కారు తమ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల జేబులు నింపేందుకే సరికొత్త ‘మద్యం’ ఎత్తుగడలు వేస్తోందన్న విమర్శలు జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో మద్యం దుకాణాల రెండేళ్ల లైసెన్సు గడువు అక్టోబర్ 2వ తేదీతో ముగియనుంది. కొత్త పాలసీ ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, అలా చేస్తే తమ అనుచరుల చేతుల్లో ఉన్న దుకాణాలు చేజారిపోతాయన్న భయంతో కూటమి పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పాతవారికే మరో ఏడాది పాటు లైసెన్సులను రెన్యూవల్ చేస్తూ టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని లిక్కర్ సిండికేట్ల చేతిలోనే మళ్లీ మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి.
పక్కా ప్రణాళికే...
జిల్లా పరిధిలో మొత్తం 138 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటిలో 125 ఓపెన్, 13 గీత కులాలకు కేటాయించారు. వీటికి సంబంధించి ఎకై ్సజ్ శాఖ ఇప్పటికే రెన్యూవల్ ప్రక్రియను ప్రారంభించింది. రెన్యూవల్ చేసుకోని షాపులకు దరఖాస్తులు స్వీకరించి లాటరీ వేస్తామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి జిల్లాలోని అత్యధిక మద్యం దుకాణాలు అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నియోజకవర్గ స్థాయి నేతల బినామీలు, వారి అనుకూల వ్యాపారుల చేతుల్లోనే ఉన్నాయి. గత రెండేళ్ల కాలంలో ఈ దుకాణాల ద్వారా అధికార పార్టీ నేతలు రూ.వందల కోట్ల వ్యాపారం సాగించి భారీగా ఆర్జించారు. మళ్లీ టెండర్లు పిలిచి ఓపెన్ లాటరీ నిర్వహిస్తే ఇతర వ్యాపారులు రంగంలోకి దిగి తమ గుత్తాధిపత్యానికి గండి కొడతారని భావించిన నేతలు.. పాత పాలసీనే కొనసాగించాలని ప్రభుత్వ పెద్దలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుకున్నది సాధించారు.
‘స్థానిక’ నిధుల కోసమే..
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన ప్రచార ఖర్చులు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా నిధులు అవసరం అవుతాయి. మద్యం దుకాణాలు తమ వారి చేతుల్లోనే ఉంటే అటు నిధులు, ఇటు మద్యం పంచి గెలవాలని భావిస్తున్నట్లు ఆరోపణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మద్యం అమ్మకాలపై తొలుత 20 శాతం కమీషన్ ఇస్తామని చెప్పి, ఆ తర్వాత దానిని 9 శాతానికి, అనంతరం 15 శాతానికి పరిమితం చేసిందని సిండికేట్లు వాదిస్తున్నాయి. తాము నష్టపోతున్నామంటూ మొసలి కన్నీరు కార్చడంతో ప్రభుత్వం నిర్ణయం తీసకున్నట్లు పైకి చెబుతున్నారు. క్వార్టర్ బాటిల్‌పై ఎమ్మార్పీకి కనీసం రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అదనపు బాదుడు ద్వారా జిల్లావ్యాప్తంగా నిత్యం రూ.లక్షలు అధికార పార్టీ నేతల జేబుల్లోకి నేరుగా చేరుతోందని సమాచారం.
షాపుల వ్యవహారం ఒకెత్తయితే, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ వ్యాపారం మరో ఎత్తు. కొనుగోలు చేసిన మద్యం తాగడానికి మాత్రమే ఉద్దేశించిన పర్మిట్ రూములను హోటళ్లు, స్టార్ బార్ల తరహాలో నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ భారీ ఎత్తున ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింకులను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రైవేట్ వ్యాపారం సాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి రూ.10 లక్షల జరిమానా విధిస్తామని, సీసీ కెమెరాలు ట్యాంపరింగ్ చేస్తే కేసులు పెడతామని ఎకై ్సజ్ అధికారులు మీడియా ముందు ప్రకటనలు గుప్పిస్తున్నా, క్షేత్రస్థాయిలో అదేం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే మద్యం మాఫియా నడుస్తుండటంతో తనిఖీలు చేసే సాహసం కూడా చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా సంక్షేమాన్ని, ఆరోగ్యాలను గాలికొదిలేసి కేవలం కూటమి నేతల జేబులు నింపేందుకు, లైసెన్సులు రెన్యూవల్ చేశారని విమర్శలు వస్తున్నాయి.


