లక్ష్మీపురం: జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్యాంకర్‌ల సమావేశం ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరుగుతుందని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కందుల దుర్గేష్ హాజరు కానున్నారని తెలిపారు. అనంతరం జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.
తెనాలి రూరల్: నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి మహిళ మృతికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌కు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బుధవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2021 మార్చి 14న తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన కావూరి ఉషారాణి, మేనల్లుడు మాచర్ల నవీన్‌బాబు కలిసి స్కూటీపై రేపల్లెకు బయలుదేరారు. కొల్లూరు గ్రామం కృష్ణానది కరకట్ట దగ్గరకు వచ్చేసరికి టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఉషారాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. డ్రైవర్ బుడంపాడు గ్రామానికి చెందిన కొండమూది మస్తాన్‌పై కేసు నమోదు చేశారు. బుధవారం కేసు విచారణకు రాగా నిందితుడిపై నేరం రుజువు కావడంతో తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) ఏకా పవన్ కుమార్... నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ ఏపీపీ పరిశపోగు సునీల్ కుమార్ వాదించారు. అప్పటి కొల్లూరు ఏఎస్‌ఐ కె. శోభన్‌బాబు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా.. తరువాత అప్పటి ఎస్‌ఐ ఎస్. ఉజ్వల్‌కుమార్ చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టు కానిస్టేబుళ్లు మాధవరావు, వెంకట్ సహకారం అందించారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.6029 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.


