బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జిని ఢీకొట్టిన టిప్పర్
తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే మార్గంలో కృష్ణానది ఎగువ ప్రాంతంలోని బకింగ్‌హామ్ కెనాల్ వద్ద ఓ టిప్పర్ లారీ గురువారం అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి సెంటర్ నుంచి అమరావతి కరకట్ట వైపు లారీ వెళుతోంది. అక్కడ రోడ్డు పల్లంగా ఉండడంతో బ్రేకులు పడకపోవడంతో వేగంగా వెళ్లి బకింగ్‌హామ్ కెనాల్ హెడ్ స్లూయిస్ గేటు దిమ్మకు ఢీకొని లారీ నిలిచిపోయింది. లారీ క్యాబిన్ పూర్తిగా దెబ్బతింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే మార్గం, వీవీఐపీలు తిరిగే మార్గం కావడంతో తాడేపల్లి పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల, భద్రతా సిబ్బంది లారీని యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. ఈ సమయంలో 45 నిమిషాల పాటు ప్రకాశం బ్యారేజ్, మంగళగిరి రోడ్డు నుంచి కరకట్టవైపు వెళ్లే వాహనాలను, సచివాలయం నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్లే వాహనాలను నిలిపివేశారు.


