మంగళగిరి రూరల్: నిర్మాణంలో ఉన్న భవనాల్లో విద్యుత్ వైర్లను చోరీ చేసి వాటి నుంచి కాపర్‌ను వేరు చేసి విక్రయిస్తున్న ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మొత్తం 10 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వారి వద్ద నుంచి 28 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న రాగి తీగ విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందన్నారు. మండలంలోని కాజా టోల్‌గేట్ సమీపంలోని ఓ టెక్ పార్క్‌లో భద్రపరిచిన 20 బండిళ్ల ఎలక్ట్రికల్ వైర్లు చోరీకి గురయ్యాయని జూన్6న నిర్మాణ కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో కాజా, చినకాకాని ప్రాంతాల్లో నిర్మాణ భవనాల నుంచి వైర్లు చోరీ చేసి వాటిని కాల్చి కాపర్‌గా మార్చి పేరేచర్లకు చెందిన పాత సామాను వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు గండాలయ్యపేట, తాడికొండ, పేరేచర్లలకు చెందిన మొగిలి మధు, జగన్నాథం, ఏసుబాబు, సాంబయ్య, నాగ తేజ, ఉయ్యాల సతీష్ లపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయటం జరుగుతుందన్నారు. కేసు దర్యాప్తులో ఏఎస్‌ఐ రత్నరాజు, హెడ్ కానిస్టేబుళ్లు శ్యామ్, రాము, చలమరావు, కానిస్టేబుల్ సాగర్ పాల్గొన్నారు.


