గుంటూరు వెస్ట్: స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 15న అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న మార్గం, ప్రధాన వేదిక ఏర్పాటు, జాతీయ జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు, న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, ఉన్నత అధికారులు, ఇతర విభాగాల వ్యక్తులు కూర్చొనేందుకు ఏర్పాట్లు, పోలీస్ పెరేడ్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులు, సాధారణ ప్రజానీకం వాహనాల పార్కింగ్, ప్రభుత్వ ప్రగతిని తెలియజేసే వివిధ శాఖల శకటాలు, తదితర అంశాలను పరిశీలించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ అభిషేక్, డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ప్రొటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు, సీఆర్‌డీఏ ఇంజినీర్లు పాల్గొన్నారు.
శాఖల మధ్య సమన్వయం కీలకం..
ప్రజా సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ పేర్కొన్నారు. గుంటూరు నగర పాలక సంస్థతోపాటు జిల్లాలోని ఇతర అభివృద్ధి పనులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ మధ్య నెలకొన్న వివిధ సమస్యలను పరస్పర సమన్వయంతో పరిష్కరించేందుకు బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసి హాల్లో జిల్లా కలెక్టర్, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ సుధీష్ణ సేన్ మాట్లాడుతూ, రైల్వే శాఖ పరిధిలో ఉన్న సమస్యలను జిల్లా యంత్రాంగం, గుంటూరు నగర పాలక సంస్థతో సమన్వయం చేసుకుంటూ సత్వర పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. జిఎంసీ కమిషనర్ మాయూర్ అశోక్, రైల్వే అడిషనల్ డీఆర్‌ఎం రమేష్ కుమార్, రెవెన్యూ, రైల్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.
యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలి
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులను పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చేసేందుకు ర్యాంప్, ఈఎస్డిపీ కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆధ్వర్యంలో ర్యాంప్ ఎంట్రీప్యూనర్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ పథకంలో 10 రోజుల పాటు ఎంటర్ప్‌రనెస్ట్ గురించి మరో 10 రోజులు టెక్నికల్ కోర్సుల గురించి ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు మధ్యనున్న యువతీ యువకులు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ వి.విజయలక్ష్మి అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ


