తాడేపల్లి రూరల్: గిరిజన గురుకుల ఉపాధ్యాయులను చంద్రబాబు ప్రభుత్వం రోడ్డున పడవేసిందని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ విమర్శించారు. బుధవారం తాడేపల్లిలోని గురుకుల కమిషనర్ కార్యాలయం వద్ద గత 12 రోజులుగా ఆందోళన చేస్తున్న గిరిజన గురుకుల ఉపాధ్యాయులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆందోళన చేయడానికి వీలు లేదని, అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని, కానీ ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. వీరికి రాష్ట్రంలోని లక్షలాది మంది అంగన్‌వాడీలు అండగా నిలుస్తారని హెచ్చరించారు. విద్యాశాఖలో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో అతి తక్కువ వేతనం రూ. 12 వేలు తీసుకుంటూ గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గురుకుల ఉపాధ్యాయులను రెన్యువల్ ఎందుకు చేయరని ప్రశ్నించారు. తొలగించిన వందలాదిమంది ఉపాధ్యాయులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్కర్స్ జేఏసీ నాయకులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతు ప్రభుత్వం గురుకుల ఉపాధ్యాయుల సమస్యను తాత్సారం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సంఘం నాయకులు మల్లిఖార్జున నాయక్, పరమేశు, విజయ నాయక్, మహమ్మద్, తార, దిల్షాద్, బాబు, పీటర్‌పాల్, రాజేష్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ


