ఎస్పీ ఎదుట బాధితుల మొర
నగరంపాలెం: ఉద్యోగాల పేర్లతో లక్షలు కాజేశారంటూ బాధితులు వాపోయారు. డబ్బులు తిరిగి చెల్లించమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం పిజిఆర్‌ఎస్ నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదిదారుల మొరను అలకించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా విచారించారు. బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. 166 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఫిర్యాదిదారులకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఉచితంగా అన్నదానం చేశారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), శివాజీ (సీసీఎస్)లు ఫిర్యాదులు స్వీకరించారు.
గుంటూరు ఎడ్యుకేషన్: సదరన్ ప్రైవేటు లెక్చరర్స్, టీచర్స్ ఆర్గనైజేషన్ (ఎస్‌పీఎల్‌టీఓ) ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు సంస్థ గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు దరఖాస్తులు సమర్పించాలని, సెప్టెంబర్ 6వ తేదీ గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో పురస్కారాలను ప్రదానం చేస్తామని తెలిపారు. వివరాలకు సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పయర్థ నాగయ్యను 99499 29674 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
తెనాలి: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్ భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఈనెల 18న నిర్వహించిన గీతాంజలి సర్కిల్ ఫర్ యంగ్ క్రియేటివ్ రైటర్స్ (జీసీవైసీడబ్ల్యు) ఆధ్వర్యంలోని ‘కృష్ణన్ తల్వార్ అవార్డ్ ఫర్ యంగ్ క్రియేటివ్ రైటర్స్‘ కార్యక్రమంలో భారతీయ బాల కవయిత్రులు ప్రణవి బిట్రా, ఇషాన్వి బిట్రా విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. ఈ సోదరీమణులు మంగళగిరికి చెందిన బిట్రా వెంకటేశ్వరరావు, మల్లికల కుమార్తెలు. పదహారేళ్ల ప్రణవి బిట్రా సృజనాత్మక రచనలో ప్రతిభ, ఊహాశక్తి, సాహిత్య నిబద్ధతకు గుర్తింపుగా ‘కృష్ణన్ తల్వార్ అవార్డ్ ఫర్ యంగ్ క్రియేటివ్ రైటర్స్–2026‘ ప్రదానం చేశారు. అదే కార్యక్రమంలో ఆమె సోదరి, 12 ఏళ్ల ఇషాన్వి బిట్రాకు సృజనాత్మక రచనలో చురుకై న భాగస్వామ్యానికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ను అందజేశారు. డాక్టర్ కృష్ణ కుమార్, చిత్ర కుమార్ స్థాపించిన గీతాంజలి సర్కిల్ ఫర్ యంగ్ క్రియేటివ్ రైటర్స్, ఈ యువ రచయిత్రుల సాహిత్య ప్రతిభను అభినందిస్తూ, భవిష్యత్తులో సృజనాత్మక రచనలు చేసి ప్రపంచ సాహిత్యానికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించింది. యూకేలోని డెర్బీ పట్టణంలో ఉంటున్న బిట్రా వెంకటేశ్వరరావు రోల్స్‌రాయిస్ ప్రధాన కార్యాలయంలో ఒక డివిజన్ టీమ్ లీడర్‌గా చేస్తుండగా, మల్లిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్‌గా ఉన్నారు. వీరి కుమార్తెలు ప్రణవి 11 క్లాస్ పాసై, కాలేజిలో చేరనుండగా, ఇషాన్వి ఫోర్త్ క్లాస్ చదువుతోంది. చదువుతోపాటు సృజనాత్మక అంశాల్లో రాణిస్తున్న వీరు, కవితా రచనలోనూ సాధనచేస్తూ గుర్తింపును సాధించటం స్ఫూర్తిదాయకం.


