20వ రోజు కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేతల నిరాహార దీక్ష
మంగళగిరి రూరల్: మంగళగిరి మండలం చినకాకాని పరిధిలోని ఎన్నారై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద 20 రోజులుగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు తమకు రావాల్సిన సబ్సిడీ బకాయిలను విడుదల చేయాలని నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఇది కచ్చితంగా వివక్షేనని అన్నారు. మేము పారిశ్రామికవేత్తలమే కాని అసాంఘిక శక్తులం కాదు. దేశ ప్రగతిలో, జీఎస్టీలో మేము భాగస్తులమే ఈ విషయాన్ని ప్రభు త్వం మర్చిపోయి మా డిమాండ్లు నెరవేర్చకుండా నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకోకుండా చిత్రహింసలుకు గురి చేస్తుందని వాపోయారు.
పోలీసులు, పారిశ్రామికవేత్తల మధ్య వాగ్వాదం
పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ర్యాలీగా బయలుదేరుగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు తీసుకున్నామని పారిశ్రామికవేత్తలు చెప్పినప్పటికీ పోలీసులు నిరాకరించారు. ఈ దశలో పోలీసులకు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామివేతల మధ్య వాగ్వాదం జరిగింది. అమరావతి ఓఎస్డీ మనోజ్ హెగ్డే పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన అనంతరం మరొకసారి అనుమతి తీసుకొని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తామని వారు నిరాహార దీక్ష శిబిరానికి వెళ్లారు.
సీపీఎం, కేవీపీఎస్ మద్దతు
ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల నిరాహార దీక్ష శిబిరాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తానన్నా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఊబిలో ముంచుతుందని దుయ్యబట్టారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు అండా మాల్యాద్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సమస్య పరిష్కారం కోసం దళిత సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు.
ఏపీ ఎమ్మార్పీఎస్ మద్దతు
ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. అధ్యక్షుడు ఆనర్‌బాబు, వైస్ ప్రెసిడెంట్ రామ్మూర్తినాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.రమేష్, కారం సత్యనారాయణమ్మ, కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చినమౌలాలి, త్రిమూర్తులు, అమలాపురం కోఆర్డినేటర్ నాగలక్ష్మి, గుంటూరు జిల్లా కోఆర్డినేటర్లు దయాకర్, నీరజ, కడప కోఆర్డినేటర్ ఆర్‌ఎం రా జా, నంద్యాల నుంచి సుబ్బారాయుడు, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.


