తెనాలిరూరల్: హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ నాజరుపేటలో ఈ నెల 15వ తేదీ పొద్దుపోయాక కొల్లిపర కోటేశ్వరరావును అని తల్లిదండ్రులు భాస్కరరావు, బుల్లెమ్మ, తమ్ముడు మరియదాసు దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన నేపథ్యం, దారి తీసిన ఘటనలు వంటి వివరాలను సోమవారం నిర్వహించనున్న విలేకర్ల సమావేశంలో అధికారులు వెల్లడించనున్నారు.
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాలల్లో వ్యవసాయ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు గతంలో ఆన్‌లైన్లో నమోదు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 21, 22వ తేదీలలో రెండవ విడత వెబ్ ఆప్షన్‌లను నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ ఎ.మణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
ఐదుగురికి గాయాలు
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని పురుషోత్తమపట్నం వినాయక గుడి వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ముందు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న ఆటో ఢీకొని బోల్తా పడింది. ఆటో డ్రైవర్ వేముల కోటేశ్వరరావుతోపాటు ప్రయాణికులు తోక చెంచు, నాగేంద్రం, మేడికొండి చంద్ర, పలపర్తి మేరీ, పలేపు వెంకాయమ్మలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నాగేంద్రంను మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.బాధితులంతా ఆదివారం ప్రార్థనలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
చీరాల రూరల్: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ జీవితంపై విరక్తి చెంది రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య ఆదివారం వివరాలు తెలిపారు. ఒంగోలు మరాఠీపాలేనికి చెందిన అనంత ఇందిరాదేవి (56) కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. అయితే మందులు వాడుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత తగ్గకపోవడంతో ఇక వ్యాధి ఎప్పటికీ తగ్గదేమోనని భావించి జీవితంపై విరక్తి చెందింది. వేటపాలెం–చినగంజాం రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైన్‌లో గుర్తు తెలియని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


