నెహ్రూనగర్: రాష్ట్రంలో కూటమి దుష్టపాలన సాగుతోందని, దానిపై రాజీలేని పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ దుశ్చర్యలను నిరసిస్తూ ఈ నెల 31, ఆగస్టు ఒకటో తేదీలలో గుంటూరులోని తన నివాసం నుంచి మంగళగిరి డీజీపీ కార్యాలయం వరకు 29 కిలోమీటర్ల మేర ‘వినతి పాదయాత్ర’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహణపై ముందస్తు ప్రణాళితోపాటు, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం బస్టాండ్ వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ... జనవరి 31న గుంటూరులో తన ఇల్లు, కార్యాలయంపై టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులు, రాళ్లతో గంటలపాటు దాడి చేసి అరాచకం సృష్టించాయని గుర్తుచేశారు. పోలీసులు అక్కడే ఉన్నా దాడిని ఆపలేదని, టీవీల్లో నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. తనను మాత్రం అక్రమంగా 18 రోజులు జైల్లో పెట్టారని, ఈ అధర్మానికి అడ్డుకట్ట వేయడానికే తాము శాంతియుతంగా డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.
టీడీపీ నేతల కోసం రాజీలా?
గుంటూరులో ఇటీవల ఒక మహిళపై జరిగిన అమానుష దాడిపై అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు 15న మధ్యాహ్నమే స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేసినా, నిందితుడు టీడీపీ నేత కావడం వల్లే స్థానిక మహిళా ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యాకే చంద్రబాబు నాటకీయంగా సీరియస్ అయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు ఐదేళ్లకు ఒకసారి మారతాయని, పోలీసులు తమ సర్వీసులపై మచ్చ తెచ్చుకోవద్దని అంబటి హితవు పలికారు. అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగి బలి పశువులు కావొద్దని, చట్టప్రకారం పనిచేయాలని హెచ్చరించారు. పాదయాత్ర కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అందరూ తరలిరండి
పాదయాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని షేక్ నూరి ఫాతిమా పిలుపునిచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోయిందని ఆగ్రహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిశీలకుడు నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
31న గుంటూరు నుంచి మంగళగిరి
డీజీపీ ఆఫీస్ వరకు అంబటి నడక
ఇల్లు, ఆఫీసుపై దాడి చేసిన ఒక్కరినీ
అరెస్ట్ చేయలేదని ఆవేదన
గుంటూరులో మహిళపై
అమానుష దాడి ఘోరమని వ్యాఖ్య


