విద్యాభివృద్ధికి ఏరువ సాయిరాం విశేష కృషి కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటుకు అంకురార్పణ ప్రతి ఏటా రూ.60 లక్షలకు పైగా మెరిట్ స్కాలర్‌షిప్‌లు ఈ ఏడాది 1600 మందికి అందనున్న ఆర్థిక సాయం నేడు పెదపలకలూరులో ఉపకార వేతనాల పంపిణీ
నేడు ఉపకార వేతనాలు పంపిణీ
గుంటూరు రూరల్: ఆయన చిన్నతనంలో చదువుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. తన స్వగ్రామంలో ఏడవ తరగతి వరకే ఉండడంతో సుదూర ప్రాంతానికి వెళ్లి స్కూలు విద్య పూర్తి చేసుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం కూడా ఆయన నాటి పరిస్థితులతో పెద్ద యుద్ధమే చేశారు. ఇదంతా గతం! ఇప్పుడాయన ఒక విజయవంతమైన ప్రవాసాంధ్రుడు! అయినా విజయ గర్వంతో పొంగిపోకుండా.. ఎదిగిన కొద్దీ ఒదుగుతూ ముందుకు సాగుతున్న అతని పేరు ఏరువ సాయిరాం!
కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా..
గుంటూరు రూరల్ మండలం, పెద పలకలూరు గ్రామానికి చెందిన ఏరువ సాయిరాం ఉత్తమమైన నడవడికతో ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ తాను ఈ స్థాయికి చేరడం వెనుక పడిన కష్టాలను మాత్రం మర్చిపోలేదు. అందుకే తనలా విద్యను అభ్యసించేందుకు ఎవరూ కష్టపడకూడదన్న సదుద్దేశంతో ఏటా వేలాది మంది విద్యార్థులకు తన తండ్రి ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉపకార వేతనాలు అందిస్తూ విద్యాదాతగా వెలుగొందుతున్నారు.
ఏరువ సాయిరాం ‘సాక్షి’తో మాట్లాడుతూ, తనలా ఎవరూ విద్య వనరుల కోసం కష్టపడకూడదనే సంకల్పంతోనే తన తండ్రి పేరిట ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఏడాది సైతం 1600 మంది విద్యార్థులకు రూ 60 లక్షలు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని బుధవారం ఉదయం పెదపలకలూరులోని శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ గ్రౌండ్‌లో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, పార్టీ పత్తిపాడు సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్, బార్ కౌన్సిల్ మెంబర్ కొమ్మసాని శ్రీనివాసులురెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు.


