మెడికల్‌ షాపులో చోరీకి యత్నం | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ షాపులో చోరీకి యత్నం

Jul 15 2026 2:04 AM | Updated on Jul 15 2026 2:04 AM

మెడికల్‌ షాపులో చోరీకి యత్నం ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పిన ద్విచక్ర వాహనాలు

సెక్యూరిటీ అలారం మోగడంతో పరారీ

మంగళగిరి టౌన్‌: మెడికల్‌ షాపులో చోరీకి వచ్చి అలారమ్‌ మోగడంతో వారు పరారీ అయిన ఘటన మంగళవారం తెల్లవారుజామున మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌ సమీపంలో గౌతమబుద్ధ రోడ్డు వెంబడి శ్రీ ధాత్రి సాయి మెడికల్‌ అండ్‌ ఫ్యాన్సీ స్టోర్స్‌ను పట్టణానికి చెందిన ఫణీంద్ర అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తన ఫోన్‌లో అలారం మోగడంతో వెంటనే షాపు సీసీ కెమెరాలను తన ఫోన్‌లో చూశాడు. అదే సమయంలో అలారం ఏర్పాటు చేసిన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ వారు కూడా ఫణీంద్రకు ఫోన్‌లో సమాచారం అందించారు. అయితే సీసీ కెమెరాల్లో ఏమీ కనబడకపోవడంతో నిద్రపోయాడు. వెంటనే మరుక్షణంలోనే అలారం మోగడంతో తన ఫోన్‌లో సీసీ కెమెరా ఓపెన్‌ చేయగా షట్టర్‌ పగలకొట్టి లోపలకు ఓ వ్యక్తి ప్రవేశించడం గమనించాడు. వెంటనే తన ఫోన్‌లో అలారం బటన్‌ నొక్కి తన షాపులో మోగే విధంగా ఏర్పాటు చేశాడు. దీంతో దుండగుడు వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంటి వద్ద నుంచి షాపు వద్దకు వచ్చి చూడగా షట్టర్‌ తాళాలు పగలకొట్టి, పైన ఉన్న సీసీ కెమెరా పక్కకు వంచి ఉండడం, సైరన్‌ బాక్స్‌ పగలకొట్టి ఉండడం గమనించాడు. వెంటనే పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాడు. అయితే పోలీసులు సరిగా స్పందించలేదని బాధితుడు తెలిపాడు. షాపులో ఎటువంటి నష్టం వాటిల్లకపోవడంతో ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు.

గతంలో ఇదే తరహాలో....

మూడేళ్ల క్రితం 2023 జూలై నెలలో ఇదే తరహాలో షాపు పైభాగంలో రంద్రం చేసి దుండగుడు లోపలకు ప్రవేశించాడని, షాపులో వున్న అధిక మొత్తంలో నగదును, హార్డ్‌డిస్క్‌ అపహరించుకుపోయినట్లు బాధితుడు ఫణీంద్ర తెలిపాడు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీస్‌ అధికారులు, క్లూస్‌ టీమ్‌ వచ్చి ఆధారాలు సేకరించి విచారించారని, కానీ నేటికీ ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదని, అందువల్లే ఇప్పుడు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయడానికి నిరాకరించినట్లు పేర్కొన్నాడు.

లోయలో పడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలింపు

మంగళగిరి టౌన్‌: మంగళగిరి పట్టణంలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఎగువ సన్నిధి కొండపై వున్న గండాలయ స్వామిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కొండపైకి వెళ్లేందుకు ఘాట్‌ రోడ్‌లో ద్విచక్రవాహనాల ద్వారా భక్తులు ప్రయాణాలు చేస్తారు. అమావాస్య కావడంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి కొండపైకి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఘాట్‌రోడ్‌లో వస్తుండగా రెండు ద్విచక్రవాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయాయి. వాటిపై ఉన్న ఇద్దరు యువకులు లోయలోకి జారుకున్నారు. గమనించిన పలువురు భక్తులు వారిని పైకి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద భరితంగా ఉన్న ఘాట్‌రోడ్‌లో ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు, సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్సకోసం స్థానిక దేవస్థానం సిబ్బందిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement