ఫీవర్‌ ఆస్పత్రి ఆర్‌ఎంఓగా డాక్టర్‌ పద్మావతి | - | Sakshi
Sakshi News home page

ఫీవర్‌ ఆస్పత్రి ఆర్‌ఎంఓగా డాక్టర్‌ పద్మావతి

Jul 14 2026 1:42 AM | Updated on Jul 14 2026 1:42 AM

గుంటూరు మెడికల్‌: పల్నాడు జిల్లా నరసరావుపేట డెప్యూటీ డీఎంహెచ్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ మక్కెన పద్మావతిని గుంటూరు గోరంట్ల గవర్నమెంట్‌ హాస్పటల్‌ ఫర్‌ చెస్ట్‌ అండ్‌ కమ్యూనికబుల్‌ డీసీజెస్‌(ఫీవర్‌ ఆస్పత్రి) సీఎస్‌ ఆర్‌ఎంఓగా నియమిస్తూ సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె.సురేష్‌కుమార్‌ ఉత్తర్యులు జారీచేశారు. గుంటూరు వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న తాడికొండ రోమ్‌లో పనిచేస్తున్న డాక్టర్‌ వై.నళినీదేవిని గుంటూరు రీజనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(ఫీమేల్‌) ప్రిన్సిపల్‌గా బదిలీ చేస్తూ సురేష్‌కుమార్‌ ఉత్తర్యులు జారీచేశారు. ఫీమేల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ పి.విజయలక్ష్మిని మన్యం పార్వతీపురం డీఎంహెచ్‌ఓగా నియమిస్తూ ఉత్తర్యులు జారీచేశారు. గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఎన్‌సీడీ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ బి.బి.ఎస్‌.రోహిణి రత్నశ్రీని మంగళగిరి ఎన్‌టీఆర్‌ వైద్యసేవ టెక్నికల్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌గా బదిలీ చేశారు.

విద్యుత్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

లక్ష్మీపురం: ఈనెల 15న విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం సీపీడీసీఎల్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి పవన్‌, జి నాగరాజులు పిలుపు నిచ్చారు. ఈమేరకు గుజ్జనగుండ్లలోని సోమవారం విద్యుత్‌ స్టోర్స్‌ కార్యాలయంలో ధర్నా పోస్టర్‌ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్‌ రంగంలో పీఆర్సీ కమిటీని నియమించాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను సంస్థలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని అన్నారు. ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కోశాధికారి కె రాంబాబు,యూనియన్‌ నాయకులు నాయక్‌, బాలు, బాజి, లక్ష్మణ్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు అంతర్‌జిల్లా

దొంగల అరెస్టు

మంగళగిరి రూరల్‌: మండలంలోని చినకాకాని గ్రామ పరిధిలోని హాయిలాండ్‌ రోడ్డులో గత నెల 17న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అంతర్‌జిల్లా దొంగలు వెంపాల చంటి, క్రోసూరు శ్రీనివాసరావును సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లిన కుటుంబాన్ని గమనించిన నిందితులు ఇంటిని రెక్కీ చేసి, తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 16 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదును అపహరించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 16 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. వెంపాల చంటిపై గతంలో సుమారు 100కు పైగా, క్రోసూరు శ్రీనివాసరావుపై 28 పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

డీఎడ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభం

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ డీసెట్‌–2026) లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేటు డీఎడ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 18వ తేదీ లోపు వెబ్‌ ఆధారిత ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించినట్లు ఏపీ డీసెట్‌ కన్వీనర్‌, పాఠశాల విద్య గుంటూరు జోన్‌ ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నమోదు చేసిన వెబ్‌ ఆప్షన్ల ఆధారంగా ఈనెల 20 నుంచి 23 వరకు సీట్ల కేటాయింపు జరుపుతామని పేర్కొన్నారు. సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు తమ తాత్కాలిక ప్రవేశ పత్రాలను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు. సంబంధిత అభ్యర్థులు ఈనెల 24 నుంచి 29 వరకు సంబంధిత ప్రభుత్వ డైట్‌ కళాశాలల్లో తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను సమర్పించి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ప్రవేశ పత్రం పొందాలని సూచించారు. డీఎల్‌ఈడీ ప్రధమ సంవత్సర తరగతులు ఈనెల 30 నుంచి ప్రారంభమవుతాయని, అర్హత సాధించిన అభ్యర్థులందరూ నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకుని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై కేటాయించిన కళాశాలలో నిర్ణీత గడువులోపు ప్రవేశం పొందాలని తెలిపారు.

గుంటూరు సీసీఎస్‌

డీఎస్పీగా శివాజీరాజా

నగరంపాలెం: గుంటూరు సీసీఎస్‌ డీఎస్పీ శివాజీరాజా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఆదివారం జిల్లా కోర్టు రోడ్డులోని గుంటూరు సీసీఎస్‌ కార్యాలయంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన డీఎస్పీ మధుసూదనరావు కర్నూలు జిల్లా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి బదిలీపై వెళ్లిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement