లక్ష్మీపురం: గుంటూరు చానల్ గండ్లకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ జిల్లా అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులకు సమస్యను పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ గుంటూరు చానల్ గండ్లు సమస్య, తూటికాడ, మురుగు పేరుకుపోయి ప్రతి సంవత్సరం వర్షాలకి పొంగిపొర్లి చేతికొచ్చిన పంటలు నీటిపాలవుతున్నాయన్నారు. సమస్య అధికారులు తాత్కాలికంగా పరిష్కారం చేస్తున్నారు తప్పితే శాశ్వత పరిష్కారం చేయడలేదన్నారు. ఫలితంగా రైతులు నష్టపోతున్నారన్నారు. రాజధాని, ఎన్నారై, చుట్టుపక్కల అపార్టుమెంట్‌ల నుంచి మురుగు నీరు మొత్తం గుంటూరు ఛానల్ లోకి వస్తుందన్నారు. దీనివలన బలహీనంగా ఉన్న కట్టలకు గండ్లు పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వరి పంటకు ఎకరానికి రూ. వేలు ఖర్చుపెట్టిన సాగు చేస్తున్న రైతులకు కట్టలకు గండ్లు బడి పూర్తిగా పంట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వ అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వల్లూరి భారతి, జిల్లా కమిటీ సభ్యులు కారుమూరి గోపాల్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, బీ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


