పర్చూరు(చినగంజాం): మహిళపై లైంగికదాడి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. శనివారం పర్చూరు పోలీస్ స్టేషన్ ఆవరణలోని మార్టూరు రూరల్ సీఐ నాగభూషణం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుమారు 36 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నివశిస్తోంది. ఆమె ప్రతి రోజూ చిలకలూరిపేట పట్టణం చుట్టు పక్కల ప్రాంతాల్లో కూలి పనులకోసం వెళ్తుండేది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎప్పటి లాగానే కూలి పనుల కోసం చిలకలూరిపేట గాంధీ పార్కు వద్ద ఎదురు చూస్తోండగా.. ఆ సమయంలో గుర్తు తెలియని యువకుడు ఆమె దగ్గరకు వచ్చి మార్టూరులో ఒక అపార్ట్‌మెంట్‌లో శుభ్రం చేయడానికి పనిమనిషి కావాలని చెప్పి తన మోటారు సైకిల్‌పై ఎక్కించుకున్నాడు. ఒంగోలు వైపు వెళుతూ మార్గమధ్యంలో తాతపూడి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద నుంచి సూరావారిపల్లె వెళ్లే రోడ్డులోకి తీసుకు వెళ్లాడు. ఆమెను గట్టిగా పట్టుకొని, కొట్టి కింద పడేసి ఆమైపె లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమె సెల్‌ఫోన్ లాక్కొని అక్కడి నుంచి మోటార్ సైకిల్‌పై పరారయ్యాడు. ఆ మహిళ ఈవిషయాన్ని తనకు తెలిసిన వ్యక్తికి చెప్పి అదే రోజు రాత్రి యద్దనపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
బైక్ చోరీ చేసి వస్తూ దొరికిన నిందితుడు
ఈమేరకు సీఐ నాగభూషణం 20వ తేదీ శనివారం ఉదయం తన సిబ్బందితో పర్చూరు వై జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు గతంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద దొంగతనం చేసిన మోటార్ సైకిల్ పై ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తూ పోలీసులను చూసి వాహనాన్ని వెనక్కి తిప్పి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అతనిని పట్టుకొని విచారించారు. సదరు యువకుడు బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన కుంభా వెంకట్(19)గా గుర్తించారు. అతడు ప్రస్తుతం గుంటూరు జిల్లా తుళ్లూరు మండల పెద్ద పరిమి గ్రామంలో ఉంటున్నాడన్నారు. పోలీస్‌ల విచారణలో నేరం చేసినట్లు అంగీకరించడంతో శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బాధితురాలి సెల్‌ఫోన్, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై పలు క్రిమినల్ కేసులున్నట్లు వారు గుర్తించారు. విలేకరుల సమావేశంలో సీఐ బి.నాగభూషణం, యద్దనపూడి ఎస్‌ఐ డి.వెంకటరత్నం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అభినందించిన ఎస్పీ ఉమామహేశ్వర్..
మహిళపై లైంగికదాడి కేసును అతి తక్కువ సమయంలో ఛేదించి, నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి, మార్టూరు సీఐ బి.నాగభూషణం, యద్దనపూడి ఎస్‌ఐ డి.వెంకటరత్నం, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, పీసీలు కుమార్, నాగూరు, హోం గార్డు అనిల్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
వివరాలు వెల్లడించిన
సీఐ నాగభూషణం


