గుంటూరు వెస్ట్: రైతుల ఆదాయం పెంచడమే వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల అంతిమ లక్ష్యం కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అధికారులతో కలసి నిర్వహించిన సమావేశంలో పెమ్మసాని మాట్లాడారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సమర్థంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో విస్తృతంగా వినియోగిస్తూ, ఉత్పాదకత పెంచేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. సమావేశంలో ఆచార్య వర్సిటీ వీసీ డాక్టర్ పీవీ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


