రైతుల న్యాయ పోరాటానికి మద్దతు | - | Sakshi
Sakshi News home page

రైతుల న్యాయ పోరాటానికి మద్దతు

Jun 18 2026 1:47 AM | Updated on Jun 18 2026 1:47 AM

అండగా ఉంటామన్న వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి

తాడేపల్లి రూరల్‌: దేశానికి వెన్నెముక రైతు అని, ప్రభుత్వాల స్వలాభాల కోసం, కార్పొరేట్‌ సంస్థల కోసం భూములు లాక్కుంటే రైతులు న్యాయపోరాటం చేసే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌ రెడ్డి అన్నారు. వారికి ఎప్పుడూ తాము అండగా ఉంటామని తెలిపారు. బుధవారం రాజధాని గ్రామమైన మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో రైతులకు న్యాయ సలహాలు అందించేందుకు న్యాయవాదులతో కలసి ఆయన పర్యటించారు. భూములను పరిశీలించాక గ్రామంలోని రైతులతో సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఏ గ్రామంలో అయినా ఇన్ని పంటలు పండే భూములను ప్రభుత్వం తీసుకోవడం సాధ్యపడదని, అధికారులు అందరూ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఒక రైతు మాట్లాడుతూ తనకు 40 సెంట్ల భూమి ఉంటే రికార్డుల్లో 25 సెంట్లు చూపిస్తున్నారని తెలిపారని వివరించారు. ఇలాంటి సమస్యలపై న్యాయ పోరాటం చేయొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శన్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, శేఖర్‌ రెడ్డి, శ్రీహరి, జి.ఎల్‌. నాగేశ్వరరావు, ఎల్లారెడ్డి, జి. శేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement