తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్నిబాధిత పసుపు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలులో వైఫల్యానికి నిరసనగా ఈ నెల 18వ తేదీన దుగ్గిరాల బంద్ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రూ.100 కోట్ల పసుపు కాలి బూడిదైనా గాని ప్రభుత్వం పట్టించుకోవకపోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు, అధికారులు చేసిన ఒప్పందానికి విలువ లేకపోతే రైతులకి ఏం న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కనీసం 179 సార్లు మంత్రులు, అధికారులు చుట్టూ అగ్ని బాధిత పసుపు రైతులు ప్రదక్షిణలు చేసినా కరుణించలేదన్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయని కూడా గుర్తుచేశారు. ఈ నెల 8న తెనాలిలో రౌండ్ టేబుల్ సమావేశం, జూన్ 10న దుగ్గిరాల పసుపు వ్యవసాయ మార్కెట్ యార్డు ముట్టడి చేసినట్టు తెలిపారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 18వ తేదీన దుగ్గిరాల బంద్‌కు అగ్ని బాధిత పసుపు రైతులు కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు. దుగ్గిరాల ప్రజలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, రైతు శ్రేయోభిలాషులు కార్మికులు, విద్యా వాణిజ్య సంస్థలు అందరూ బంద్‌కు సహకరించాలని కోరారు. వీరితో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు కూడా ఉన్నారు.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలి వాహనాలు దగ్ధం
పట్నంబజారు: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలి ద్విచక్రవాహనాలు దగ్ధమైన ఘటన కొత్తపేటలో చోటు చేసుకుంది. తెలిసిన సమాచారం.. కొత్తపేట పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ సోమవారం రాత్రి ఈదురుగాలులకు పేలింది. నిప్పులు చెలరేగడంతో అక్కడ ఉన్న మూడు ద్విచక్రవాహనాలు తగలబడినట్లు సమాచారం. అయితే పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలు సైతం పోలీసులు రోడ్డుపైనే పార్కింగ్ చేసిన పరిస్థితుల్లో, వాటితోపాటు ఇతరుల వాహనాలు కూడా తలగబడినట్లు తెలుస్తుంది.
గంజాయి కేసులో నిందితులు అరెస్టు
పట్నంబజారు: చెడు వ్యసనాలకు బానిసలుగా మారి గంజాయి సేవించడంతోపాటు, విక్రయాలు చేస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కొత్తపేట పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్‌చార్జి డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, కొత్తపేట సీఐ వీరయ్య వివరాలు మీడియాకు మంగళవారం వెల్లడించారు. నెహ్రూనగర్‌కు చెందిన గుర్రం శివకుమార్, బత్తుల శశాంక్, శ్రీనగర్‌కు చెందిన చెన్నంశెట్టి రుద్రబాలసుబ్రహ్మణ్యం, రామిరెడ్డితోటకు చెందిన దాసరి గురవయ్యలు నెహ్రూనగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే క్వార్టర్స్ వద్ద గంజాయి కలిగి ఉన్నట్లు పక్కా సమాచారంతో దాడిచేశారు. నిందితుల నుంచి ఐదు కిలోల 360 గ్రాముల గంజాయి స్వాధీనం చసుకున్నారు. ఈమేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంతో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని అభినందించారు.
రైతులు నష్టపోకుండా చూస్తాం
రాజుపాలెం: రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, సకాలంలో నష్ట పరిహారం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని సత్తెనపల్లి ఆర్డీఓ గోపాలకృష్ణ రైతులకు భరోసా ఇచ్చారు. మండలకేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో రైల్వే ట్రాక్ వలన భూములు కోల్పోయే రైతులకు అవార్డు ప్రకటించే ముందుగా మంగళవారం రైతుల అభిప్రాయాలను సేకరించారు. మండలంలో అనుపాలెం, చౌటపాపాయపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం గ్రామాలకు సంభందించిన 249 మంది రైతులకు సంబంధించిన సుమారు 20 ఎకరాల సాగు భూములను రైల్వే అధికారులు సేకరించారు. దీనికి సంబంధించి అవార్డు ప్రకటించే ముందుగా రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. కొంతమంది రైతులు ఆర్డీఓతో మాట్లాడుతూ ఇప్పుడు బయట మార్కెట్ రేటు ఎకరం రూ.2కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ధర పలుకుతుందని ప్రభుత్వం చాలా తక్కువ నష్ట పరిహారం ఇస్తుందని వాపోయారు. దీంతో తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ రేటుతో కలిపి రెండున్నర రెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. మీ పొలాల్లో ఉన్న బోర్లకు, బావులకు పెద్ద చెట్లకు అదనంగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఇది సమంజసం కాదనిపిస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తహసీల్దార్ దుర్గేశ్వరరావు, ఆర్‌ఐ గోపి, వీఆర్వోలు పుల్లయ్య, దుర్గాభాయి, శాంతి, తదితరులు పాల్గొన్నారు.


