మేడికొండూరు: గ్రామ పునర్నిర్మాణ సంఘం (వీఆర్‌ఓ)లో గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు తమకు రావలసిన పీఎఫ్, గ్రాట్యుటీ, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇతర చట్టబద్ధ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలను ఎన్నో సంవత్సరాలుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ న్యాయం జరగకపోవడంతో మరోసారి ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉద్యోగుల ప్రతినిధులు మాట్లాడుతూ 2018 సంవత్సరం నుంచి తమకు రావలసిన బకాయిల కోసం నిరంతర పోరాటం చేస్తున్నామని తెలిపారు. పీఎఫ్ కమిషనర్ సహకారంతో పలుమార్లు సంఘ యాజమాన్యానికి వినతిపత్రాలు సమర్పించడం, ధర్నాలు, నిరసనలు, సమావేశాలు, చర్చలు నిర్వహించడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. అయినప్పటికీ సంఘ యాజమాన్యం తమ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుంటూరు ప్రాంత ప్రతినిధి టి.మురళి, కమిటీ సభ్యులు రమేష్‌బాబు, మోహన్, ఏసోబు, విజయలక్ష్మి, సునీల్ తదితరులు పాల్గొని మాజీ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.


