కొల్లూరు: చోరులు కొత్త తరహా దొంగతనాలకు తెరతీశారు. దుకాణాల్లోని సిగరెట్ ప్యాకెట్లు, నగదుతో ఉడాయిస్తున్నారు. దొంగల పంథాను నిశితంగా పరిశీలిస్తే ముందస్తుగా రెక్కీ చేసి, ఎంపిక చేసుకున్న దుకాణాలలో రూ. వేల విలువైన సిగరెట్ ప్యాకెట్‌లు చోరీ చేస్తున్నారు. కొల్లూరులో వారం క్రితం ఓ దుకాణంలో సిగరెట్ ప్యాకెట్లు దొంగతనం చేశారు. అదే తరహాలో మండలంలోని దోనేపూడిలో దుకాణం తాళాలను నిమిషం వ్యవధిలోనే తొలగించి షట్టరు కింద నుంచి షాప్‌లోకి చొరబడి సిగరెట్ ప్యాకెట్‌లను మూటగట్టుకుని ఉడాయించాడు. దోనేపూడికి చెందిన వెనిగళ్ల సుధాకర్ అనే వ్యక్తి పంచాయతీ కార్యాలయం వెనుక ప్రాంతంలో రేపల్లె–తెనాలి ప్రధాన రహదారి వెంబడి కొన్నేళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున రూ.30 వేలు విలువ చేసే సిగరెట్ ప్యాకెట్లు, రూ. 3 వేల వరకు నగదును చోరుడు దొంగిలించాడు. మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై అక్కడే వేచి ఉన్నాడు. తర్వాత ఇద్దరూ దోనేపూడి కరకట్ట వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజీల ద్వారా వెల్లడైంది. పక్కా ప్రణాళికతో దుండగులు చోరీలు చేస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి. కొండలరావు తెలిపారు. కొల్లూరు ప్రాంతంలో రేయింబవళ్లు దుకాణాలు తీసి ఉండటంతో రాత్రి సమయంలో కొత్త వ్యక్తుల సంచారం అధికంగా ఉంటోంది. రాత్రి వేళ పోలీసుల గస్తీ సన్నగిల్లడం సైతం దొంగతనాలు చోటుచేసుకోవడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పాన్‌షాప్‌లో సరుకులు చోరీ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలో పాన్‌షాపులో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం.. వినుకొండ నియోజకవర్గం, నూదెండ్ల మండలం, ముప్పరాజు గ్రామానికి చెందిన గోరంట్ల సునీల్ కుటుంబ పోషణ నిమిత్తం వలస వచ్చి తాడేపల్లి పట్టణ పరిధిలోని భరతమాత సెంటర్‌లో పాన్‌షాపు అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. సోమవారం రాత్రి మూసి ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున 5 గంటలకు షాపు తీద్దామని వచ్చి చూడగా అప్పటికే తాళాలు పగలకొట్టి ఉండడాన్ని గమనించారు. దొంగలు చోరీ చేశారని గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి సుమారు రూ.50 వేల సరుకులతోపాటు, సెంటు బాటిళ్లు, ఇతర వస్తువులను చోరీ జరిగాయని తేల్చారు. ప్రముఖులు తిరిగే ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ చోరీ జరగడంపై ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇక శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వరుస దొంగతనాలతో వ్యాపారుల బెంబేలు


