అంబటి మురళీకృష్ణపై పోలీసుల జులుం | - | Sakshi
Sakshi News home page

అంబటి మురళీకృష్ణపై పోలీసుల జులుం

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

● జూపూడి ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ● అడ్డొచ్చిన రైతులు, మహిళలను సైతం లాగి పడేసిన ఖాకీలు ● టీడీపీ నేతల దాడి బాధిత రైతుల పరామర్శకు అడ్డంకులు

పొన్నూరు / చేబ్రోలు: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో పోలీసులు మరోసారి జులుం ప్రదర్శించారు. వైఎస్సార్‌ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి జరుగుతున్న మొక్కజొన్న రైతుల పరామర్శను అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యవహరించారు. బుధవారం రైతులను పరామర్శించేందుకు గ్రామానికి వచ్చిన రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌, పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణలను అరెస్టు చేసేందుకు దౌర్జన్యానికి దిగారు. మురళీకృష్ణ నివాసంలో ఉన్న ప్రభాకర్‌ను తమ వెంట పంపించాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ఎందుకు పంపించాలో కారణం చూపించాలని మురళీకృష్ణ ప్రశ్నించారు. దీంతో పొన్నూరు రూరల్‌ ఎస్‌ఐ శ్రీహరి, సీఐ కృష్ణయ్య వాగ్వాదానికి దిగారు. రైతులపై దాడి చేసిన ఆ 31 మంది ఎమ్మెల్యే ధూళిపాళ్ల అనుచరులను అరెస్టు చేస్తే పోలీసులకు ఈ కష్టాలు ఉండవు కదా అన్నారు. రైతులకు అండగా నిలిచి శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్న వైఎస్సార్‌ సీపీపై దాడి చేయడమేంటని మండిపడ్డారు. ఇంటి మొదటి అంతస్తులో ఉన్న ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకునేందుకు వెళుతున్న పోలీసులను మురళీకృష్ణ అడ్డుకున్నారు. ఆగ్రహించిన పోలీసులు ఆయన్ను బలవంతంగా నెట్టుకుంటూ పోలీసు వాహనం ఎక్కించారు. తర్వాత మళ్లీ ఇంట్లోకి ప్రవేశించి మురళీకృష్ణ సోదరితోపాటు అనేక మంది మహిళలు ఉన్నప్పటికీ తోసుకుంటూ మొదటి అంతస్తులోకి వెళ్లి తలుపు పగలగొట్టి జూపూడి ప్రభాకర్‌ను బలవంతంగా తీసుకువచ్చి పోలీసు జీపు ఎక్కించారు. వాహనానికి అడ్డుపడిన పార్టీ కార్యకర్తలు, రైతులపై లాఠీచార్జ్‌ చేశారు. మహిళలను సైతం మగ పోలీసులు దౌర్జన్యం చేస్తూ లాగిపడేశారు. పొన్నూరు రూరల్‌ సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ శ్రీహరి, పట్టణ సీఐ వీరా నాయక్‌, తెనాలి సీఐ, చేబ్రోలు ఎస్‌ఐలతోపాటు పోలీసులు రైతుల పట్ల దారుణంగా వ్యవహరించడాన్ని గ్రామస్తులు, రైతులు ఖండించారు. వారిద్దరినీ చేబ్రోలు పోలీసు స్టేషన్‌కు తరలించి రెండు గంటల పాటు ఉంచి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఇద్దరిని పంపించేశారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మామిళ్లపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు చేసిన దౌర్జన్యంలో నష్టపోయి, ఎస్సీ, ఎస్టీ కేసులు ఎదుర్కొంటున్న మొక్కజొన్న రైతులను వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు పరామర్శించి సంఘీభావం ప్రకటించడం తప్పా అని ప్రశ్నించారు.దౌర్జన్యం చేసిన పోలీసులపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు.

అరాచకం సృష్టిస్తున్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల

పొన్నూరు ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా.. కష్టంపై ఆధారపడి జీవనం సాగించే రైతులపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా చంద్రబాబుకు కనిపించడం లేదా అని వైఎస్సాఆర్‌ సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన వెంకట మహేష్‌ నిలదీశారు. రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్‌ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ చేసింది నేరమా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌, పార్టీ రాష్ట్ర నాయకుడు జూపూడి ప్రభాకర్‌ను పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని ధ్వజమెత్తారు. కాపు రైతులకు అండగా నిలుస్తున్న మురళీకృష్ణను వేధించడం ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేయడమేనని విమర్శించారు. టీడీపీకి చెందిన 31 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బుధవారం ఒక ప్రకటనలో ఈ మేరకు విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement