అవయవదానం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

అవయవదానం అభినందనీయం

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

అవయవదానం అభినందనీయం

తాడేపల్లిరూరల్‌: అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని మణిపాల్‌ హాస్పిటల్‌ వైద్యులు సోమవారం పేర్కొన్నారు. చిలకలూరి పేటకు చెందిన పెడవల్లి నాగేశ్వరరావు (45) ఈనెల 23వ తేదీ తన కుమార్తెతో బైక్‌పై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆరోగ్యపరిస్థితిలో మార్పులేకపోవడంతో 24వ తేదీ గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా, వైద్యుల సలహా మేరకు తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్‌ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. వైద్యపరీక్షల అనంతరం నాగేశ్వరరావుకు బ్రెయిన్‌లో రక్తస్రావం ఉందని తెలిపి చికిత్స ప్రారంభించారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఏప్రిల్‌ 26వ తేదీ సాయంత్రం బ్రెయిన్‌డెడ్‌గా పరిగణించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నాగేశ్వరరావు తండ్రి ఆదినారాయణ, కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్‌ జీవన్‌దాన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.రాంబాబు, హాస్పిటల్‌ డైరెక్టర్‌ రామాంజనేయ రెడ్డిల ఆధ్వర్యంలో ఒక కాలేయం, ఒక కిడ్నీని మణిపాల్‌ హాస్పిటల్‌లో అవసరమైన వారికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ నిర్వహించారు. కార్నియాను విజయవాడ ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాత కుటుంబానికి మణిపాల్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.

ఫార్మాశిస్టుల ఫైనల్‌

మెరిట్‌ లిస్టు విడుదల

గుంటూరు మెడికల్‌: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఫార్మశీ అధికారి పోస్టులు కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేసేందుకు జనవరిలో దరఖాస్తులను ఆహ్వానించినట్లు గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ జి. శోభారాణి తెలిపారు. దరఖాస్తులను స్క్రూటిని చేసి ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేశామన్నారు. ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ను సీఎఫ్‌డబ్ల్యూ. ఏపీ.ఎన్‌ఐసి. ఇన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, 28వ తేదీన అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు.

సృజనాత్మకతను వెలికితీసేందుకు శిక్షణ శిబిరాలు దోహదం

తాడేపల్లి రూరల్‌: చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి వేసవి శిక్షణ శిబిరాలు తోడ్పడతాయని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర గ్రంథాలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాల్లో పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. పిల్లలు సెల్‌ఫోన్‌కి బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమ్మర్‌ క్యాంపులో వ్యాసరచన పోటీలు, కథ చెబుతాను.. ఊ కొడతారా, చిత్రలేఖనం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, హస్త కళలు, యోగా, ధ్యానం, గణితంలో మెళకువలు, క్విజ్‌, సైన్స్‌ ప్రయోగాలు, పర్యావరణంపై అవగాహన, ఆరోగ్యం, పరిశీలన, కార్టూన్‌, సామాజిక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement