నిత్యాన్నదానానికి రూ. 90,001 విరాళం | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి రూ. 90,001 విరాళం

Apr 12 2026 3:42 AM | Updated on Apr 12 2026 3:42 AM

నిత్యాన్నదానానికి రూ. 90,001 విరాళం రేపు అండర్‌–18 బాల బాలికల బాస్కెట్‌బాల్‌ పోటీలు కమర్షియల్‌ ట్యాక్సెస్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ స్పోర్ట్స్‌ మీట్‌ సోషల్‌ యాక్టివిస్ట్‌పై కేసు యువకుడు ఆత్మహత్య

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గుంటూరుకు చెందిన భక్తులు ధరణికోట గిరిజ శుక్రవారం రూ. 90.001 విరాళంగా సమర్పించుకున్నారు. విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్‌ అచ్యుత మదుసూదనరావుకు అందజేశారు. ఆలయ మర్యాదలతో దాతను సత్కరించారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): న్యూ అసోసియేషన్‌ ఆఫ్‌ గుంటూరు డిస్ట్రిక్ట్‌ బాస్కెట్‌ బాల్‌ ఆధ్వర్యంలో అండర్‌–18 బాల బాలికల బాస్కెట్‌బాల్‌ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రేవతి, జి.ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. ఈ పోటీలను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని టాప్‌ కిడ్స్‌ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. పాల్గొనే వారు పోటీలకు అరగంట ముందు రిపోర్ట్‌ చేయాలని తెలిపారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ తప్పక తీసుకురావాలని పేర్కొన్నారు. వివరాలకు ఆంజనేయులు 98663 34528 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో ఆంధ్రప్రదేశ్‌ కమర్షియల్‌ ట్యాక్సెస్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా స్పెషల్‌ కమిషనర్‌ సౌమ్య, కమిషనర్‌ డాక్టర్‌ కె.రవిశంకర్‌ హాజరయ్యారు. ఈ స్పోర్ట్స్‌ మీట్‌లో భాగంగా క్రికెట్‌, టెన్నిస్‌, షటిల్‌, టెన్నికాయిట్‌, చెస్‌, 2 కే రన్‌, 1కే రన్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, మ్యూజికల్‌ చైర్స్‌ తదితర విభాగాల్లో క్రీడలు నిర్వహించారు. కార్యక్రమంలో గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి కె.మురళీకృష్ణ, కల్చరల్‌ సెక్రటరీ జగదీష్‌బాబు పాల్గొన్నారు.

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌): రాజధాని అమరావతి గురించి ప్రస్తావిస్తూ ట్విట్టర్‌ వేదికగా పోస్టింగ్‌ పెట్టాడనే నెపంతో సోషల్‌ యాక్టివిస్ట్‌పై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రాజధాని అమరావతి గురించి జగన్‌ వారియర్‌ అనే పేరుతో ఉన్న ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా రాజధానికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావిస్తూ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టులు పెట్టాడు. దీనిపై పలువురు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్‌ యాక్టివిస్ట్‌ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

నరసరావుపేట రూరల్‌: విషం సేవించి యువకుడు మృతిచెందిన ఘటన ఇస్సపాలెం– జొన్నలగడ్డ బైపాస్‌రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలు. బెల్లంకొండ మండలం పాపాయపాలేనికి చెందిన బిట్రగుంట వెంకట్రావు(28) పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో గతంలో ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హైదరాబాద్‌లో చికిత్స పొంది కోలుకున్న వెంకట్రావు ఆసుపత్రిలో విధులకు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఇస్సపాలెం–జొన్నలగడ్డ బైపాస్‌లోని పంట పొలంలో వెంకట్రావు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో రూరల్‌ ఎస్‌ఐ కిషోర్‌ ఘటాన స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

దారిదోపిడీ నిందితుడి అరెస్ట్‌

నరసరావుపేట రూరల్‌: దారిదోపిడీ కేసులో నిందితుడిని రొంపిచర్ల పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రూరల్‌ సీఐ ఎంవీ సుబ్బారావు కేసు వివరాలు తెలియజేశారు. గత నెల 16వ తేదీన ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన మహిళ స్కూటీపై నరసరావుపేట నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన వ్యక్తి ఆమెను అటకాయించి రొంపిచర్ల మండలం తుంగపాడు సమీపంలో పొలాల్లోకి తీసుకెళ్లి బంగారు వస్తువులు దోచుకెళ్లాడు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన మంగళగిరికి చెందిన రాచగిరి రాఘవయ్యను సుబ్బయ్యపాలెం వద్ద అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి రూ.15వేల నగదు, రెండు వెండి ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రొంపిచర్ల ఎస్‌ఐ లోకేశ్వరరావు, ఏఎస్‌ఐ కిషోర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement